Kia Seltos | కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రత్యేకించి కుటుంబ సభ్యులంతా హాయిగా ప్రయాణించడానికి వీలుగా ఉన్న ఎస్యూవీ కార్లపై మోజు పెంచుకుంటున్నారు. కొంతకాలంగా ఎస్యూవీ కార్ల విక్రయాలు పెరుగుతున్నాయి.
ఈ తరుణంలో దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటార్ ఇండియా.. కస్టమర్ల దరి చేరేందుకు ప్రణాళిక రూపొందించింది. తద్వారా హ్యుండాయ్ మోటార్ ఇండియా క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, స్కోడా కుషఖ్, ఫోక్స్ వ్యాగన్ టైగూన్ తదితర మిడ్ సైజ్ ఎస్‌యూవీలతో పోటీ పడేందుకు ముందుకు వచ్చింది. అందుకోసం కియా తన పాపులర్ మిడ్ సైజ్ ఎస్యూవీ సెల్టోస్ మీద రూ.1.83 లక్షల వరకు బెనిఫిట్లు కల్పిస్తామని ప్రకటించింది.
కియా సెల్టోస్ టాప్ ఆఫ్ వర్షన్ ఎక్స్-లైన్ 1.5 లీటర్ల డీజిల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్‌పై బెనిఫిట్లు అందిస్తోంది. దీని ధర రూ.19.65 లక్షలు. ఎక్స్ లైన్ 1.5 లీటర్ల ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కారులో 1.5 లీటర్ల సీఆర్డీఐ వీజీటీ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 116 పీఎస్ విద్యుత్, 250 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో పని చేస్తుంది.
ఈ కారు కొనుగోలుదారులకు కియా యాజమాన్యం ఇన్సూరెన్స్ బెనిఫిట్ల రూపంలో రూ.81 వేల వరకు, ఎక్స్చేంజ్ బెనిఫిట్ల రూపంలో రూ.60 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.17,500, విడి భాగాల ఉచిత సరఫరాతో రూ.25 వేల డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నది.
వేరియంట్ల వారీగా ఇన్సూరెన్స్ బెనిఫిట్లు, మోడల్ నుంచి మోడల్‌కు ఎక్స్చేంజ్ ప్రయోజనాలు, కంపెనీ టు కంపెనీ కార్లకు కార్పొరేట్ డిస్కౌంట్లలో తేడాలు ఉంటాయి. ఈ నెల 15 లోగా ఈ కారు బుక్ చేసుకున్న కస్టమర్లకు సదరు బెనిఫిట్లు కల్పిస్తామని కియా డీలర్ షిప్ తెలిపింది. తొలిసారి 2019 ఆగస్టులో కియా మోటార్ ఇండియా మార్కెట్లోకి సెల్టోస్.. త్వరలో సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ ఆవిష్కరించేందుకు సిద్ధం అవుతున్నది.