న్యూఢిల్లీ, జూలై 15 : దక్షిణకొరియాకు చెందిన కార్ల సంస్థ కియా…దేశీయ మార్కెట్లోకి మరో ఈవీ మాడల్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే ఉన్న సైరోస్లోనే ఈవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా ప్రవేశపెట్టిన ఈ కారు సింగిల్ చార్జింగ్‌తో గరిష్ఠంగా 526 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. రెండు రకాల్లో లభించనున్న ఈ కారు 51.4 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ 526 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుండగా, 42 కిలోవాట్ల బ్యాటరీ మాడల్ 443 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నట్టు పేర్కొంది.
కేవలం 39 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతంవరకు బ్యాటరీ రీచార్జికానున్నది. రూ.25 వేలు ముందస్తుగా చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చునని కస్టమర్లకు సంస్థ సూచించింది. కేవలం 8.1 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు డిజిటల్ కీ, వర్చ్యూవల్ ఇంజిన్ సౌండ్ సిస్టమ్, బ్యాటరీ హీటింగ్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కలుపుకొని 25కి పైగా భద్రత ఫీచర్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, టైర్ ప్రెషరల్ మానిటరింగ్ సిస్టమ్ వంటి నూతన టెక్నాలజీతో తయారు చేసింది.