Kaynes Technology | ఆదిబట్ల, ఆగస్టు 22: రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్ సమీపంలో శుక్రవారం అధునాతన కేన్స్ టెక్ ఎలక్ట్రానిక్ యూనిట్ సెమీకండక్టర్ల తయారీ సంస్థను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డీ శ్రీధర్ బాబు, స్పీకర్ ప్రసాద్ కుమార్‌లు హాజరు కానున్నారు.
కేన్స్ టెక్ ఎలక్ట్రానిక్ యూనిట్‌కు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే బీజం పడింది. గత ఏడాది అక్టోబర్‌లో కేన్స్ టెక్నాలజీ నాయకత్వ బృందం అప్పటి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. అనంతరమే కొంగరకలాన్‌లో రూ.2,800 కోట్ల పెట్టుబడితో అవుట్సోర్స్ సెమీకండక్టర్ సదుపాయాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు వారు ప్రకటించారు. ప్రభుత్వం తరఫున కావాల్సిన అన్ని సహాయ, సహకారాలు అందిస్తామని కేన్స్ టెక్ ప్రతినిధులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. దీంతో ఈ యూనిట్ ఏర్పాటుతో దాదాపు 2 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేస్తామని సంస్థ పేర్కొన్నది. ఈ క్రమంలోనే ఫాక్స్‌కాన్ ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 300లో 46 ఎకరాల భూమిని నాటి ప్రభుత్వం కేటాయించింది.