హైదరాబాద్, ఆగస్టు 23: కొత్తగా ఏర్పాటవుతున్న ఫ్యూచర్ సిటీకి సెమీకండక్టర్ల తయారీ సంస్థ కేన్స్ టెక్నాలజీస్ సాంకేతిక చుక్కానిగా నిలువనున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కొనియాడారు. కొంగర్‌కలాన్‌లో సంస్థ ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పరిశ్రమను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రూ.2,800 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ యూనిట్‌తో రెండు వేల మందికిపైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. తమ ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ పరిశ్రమలకు ఆర్థిక రాయితీలు, మౌలిక సదుపాయాలు కల్పించి ప్రోత్సహిస్తున్నదని చెప్పారు. హై ప్రెసిషన్ ఎలక్ట్రానిక్ అసెంబ్లీ, 3 డీ ఆప్టికల్, కృత్రిమ మేథస్సు ఆధారంగా అత్యాధునిక ఇన్స్పెక్షన్ వ్యవస్థలు కేన్స్ టెక్నాలజీ ప్లాంటులో అందుబాటులోకి రానున్నట్లు మంత్రి వివరించారు. భారత సెమీ కండక్టర్ మిషన్ కింద కేన్స్ టెక్నాలజీకు త్వరలో చిప్ తయారీ అనుమతి లభించే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. కొంగర్‌కలాన్ ప్లాంట్‌లో స్మార్ట్ మీటర్లు, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ వాహన రంగం, ఏరోస్పేస్ ఇండస్ట్రీకి అవసరమైన ఉన్నతస్థాయి ఎలక్ట్రానిక్ పరికరాలను ఉత్పత్తి చేస్తున్నదని శ్రీధర్ బాబు వివరించారు. ఈ కార్యక్రమానికి కేన్స్ టెక్నాలజీస్ చైర్మన్ సబిత రమేశ్, కంపెనీ సీఈవో రఘు పనిక్కర్, ఎండీ రమేశ్ కణ్ణన్, టీజీఐఐసీ వైస్ చైర్మన్ విష్ణువర్థన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.