Jio Financial Services | బిలియనీర్ ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ నుంచి విడివడిన సంస్థ జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎఫ్ఎస్ఎల్) తొలి రోజే రికార్డులు బ్రేక్ చేసింది. దాని మార్కెట్ విలువ రూ.1.72 లక్షల కోట్లు (21 బిలియన్ డాలర్లు). అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్, టాటా స్టీల్, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోల్ ఇండియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), బజాజ్ ఆటో వంటి సంస్థలను దాటేసింది. మార్కెట్ క్యాపిటలైజేషన్లో దేశంలోనే అత్యంత విలువ గల 32వ సంస్థగా నిలిచింది. త్వరలో దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కానున్న జియో ఫైనాన్సియల్.. గురువారం స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్లో నికర ధర కొనసాగుతూ వచ్చింది.
జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ (రిలయన్స్ స్ట్రాటర్జిక్ ఇన్వెస్ట్మెంట్స్) ను తమ సంస్థ నుంచి డీ మెర్జర్ చేస్తున్నట్లు గురువారం రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ఇందుకోసం గురువారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ లిమిటెడ్ (జేఎఫ్ఎస్ఎల్)పై బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో స్పెషల్ ప్రీ-ఓపెన్ సెషన్ ట్రేడింగ్ నిర్వహించారు. బుధవారం రిలయన్స్ షేర్ విలువ, గురువారం డీ మెర్జర్ తర్వాత రిలయన్స్ షేర్ విలువ మధ్య తేడాను జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ షేర్ విలువ రూ.261.85గా లెక్క గట్టారు.
జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ (జేఎఫ్ఎస్) షేర్ విలువపై బ్రోకరేజీ సంస్థల అంచనాలను జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ అధిగమించింది. బ్రోకరేజీ సంస్థలు జియో ఫైనాన్సియల్ షేర్ విలువ రూ.160-190 మధ్య ఉండొచ్చునని అంచనా వేశారు. డీ మెర్జర్ సందర్భంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో నిర్వహించిన ప్రీ-ఓపెన్ సెషన్లో గురువారం రిలయన్స్ షేర్.. ఎన్ఎస్ఈలో రూ.2580, బీఎస్ఈలో రూ.2589 కాగా, బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఎన్ఎస్ఈలో రూ.2841.85, బీఎస్ఈలో రూ.2840 వద్ద ట్రేడింది.