న్యూఢిల్లీ, ఏప్రిల్ 8 : సెక్యూరిటీలపై డిజిటల్ రుణాల మంజూరు విభాగంలోకి జియో ఫైనాన్స్ లిమిటెడ్ ప్రవేశించింది. 9.99 శాతం ప్రారంభ వడ్డీతో రుణాలు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. తక్కువ వడ్డీకే కేవలం పది నిమిషాల్లోనే రుణాలు మంజూరు చేయడం జరుగుతున్నదని తెలిపింది. ఇందుకోసం జియో ఫైనాన్స్ ప్రత్యేకంగా యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకేచోట అన్ని రకాల ఆర్థిక సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ యాప్ను తీర్చిదిద్దినట్టు, తద్వారా వేగవంతంగా రుణాలు మంజూరు చేయడానికి వీలు పడుతుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక అవసరాలకోసం షేర్లు, మ్యూచువల్ ఫండ్ల తాకట్టుపెట్టుకొని రుణాలు ఇస్తున్నది. మూడేండ్లలోపు కాలపరిమితితో రూ.కోటి వరకు రుణాలు ఇస్తున్నది.