ఒకప్పుడు భారతీయ విమానయాన రంగాన్నే శాసించిన చరిత్ర. దేశంలోని టాప్-20 ధనవంతుల్లో ఒకరిగా గుర్తింపు. కార్పొరేట్ ప్రపంచంలో ఆయన ప్రతీ అడుగు ఓ సంచలనమే. ఎందరికో మార్గదర్శి.. మరెందరికో ఉద్యోగ-ఉపాధి ప్రదాత.
ఇప్పుడు మోసం-అవినీతి ఆరోపణలు. వేలాది మందిని రోడ్డున పడేశారన్న అపఖ్యాతి. దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు. కుటుంబానికి దూరమై జైలులో దుర్భర జీవితం. చచ్చిపోతా.. అనుమతించండంటూ కోర్టుకు విజ్ఞప్తులు.
ఇదీ.. జెట్ ఎయిర్వేస్ అధిపతి నరేశ్ గోయల్ దుస్థితి.
Naresh Goyal | ముంబై, జనవరి 10: జీవితంపై విరక్తి చెంది.. చావును ప్రసాదించాలంటూ చేతులు జోడించి వేడుకుంటున్నారు 75 ఏండ్ల జెట్ ఎయిర్వేస్ అధిపతి నరేశ్ గోయల్. దశాబ్దాల తరబడి కార్పొరేట్ ప్రపంచంలో సంపాదించుకున్న పేరు, ప్రతిష్ఠలు.. అవినీతి ఆరోపణలతో కనుమరుగైపోయాయి. ఓవైపు క్యాన్సర్ బారినపడ్డ భార్య ఇప్పుడా.. అప్పుడా అన్నట్టు ఉండటం, మరోవైపు జైల్లో తన పరిస్థితి దుర్భరంగా మారటం, ఇంకోవైపు సంతానాన్నీ అనేక సమస్యలు వేధిస్తుండటంతో నాకీ బతుకు వద్దని కన్నీటి పర్యంతమవుతూ మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ప్రత్యేక కోర్టును బతిమాలుకునే స్థాయికి గోయల్ దిగజారిపోయారు. నేను నిర్దోషిని అంటూ బోరున విలపించారు. దీంతో గోయల్ మానసిక పరిస్థితిని గమనించాలని, ఆయన ఆరోగ్యంపైనా శ్రద్ధ వహించాలని ఆయన తరఫు న్యాయవాదులకు న్యాయమూర్తి ఎంజీ దేశ్‌పాండే సూచించారు. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేశారు.
భార్యను చూసేందుకు..
గోయల్ పరిస్థితిని మానవీయ కోణంలో చూసిన కోర్టు.. క్యాన్సర్‌తో పోరాడుతున్న తన భార్యను చూసేందుకు, అలాగే వైద్య నిపుణులను కలిసేందుకు ఆయనకు అనుమతిని ఇచ్చింది. పోలీసు భద్రత నడుమే ఇదంతా జరుగాలన్నది. ఇక తన వ్యక్తిగత వైద్యులతో చికిత్సకున్న అవకాశాల్నీ పరిశీలించి, తగు చర్యలు తీసుకోవాలనీ జైలు అధికారులను ఆదేశించింది.
ఇదీ నేపథ్యం..
1949 జూలై 29న పంజాబ్‌లోని సంగ్రూర్‌లో ఓ నగల వ్యాపారి ఇంట్లో నరేశ్ గోయల్ జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో గోయల్కన్నీ కష్టాలే. ఆరో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదువు సాగింది. ఈ క్రమంలో 11 ఏండ్ల వయసులో గోయల్ ఇంటిని అప్పులిచ్చినవాళ్లు వేలం వేశారు. అయినప్పటికీ ఎలాగోలా పాటియాలా సర్కారీ కళాశాలలో బీకాం పూర్తయ్యింది. 1967లో తన మేనమామ సేథ్ చరణ్‌దాస్ రామ్ లాల్స్ ట్రావెల్ ఏజెన్సీ ఈస్ట్ వెస్ట్ ఏజెన్సీస్‌లో క్యాషియర్‌గా ఉద్యోగ జీవితం మొదలైంది. నెలకు రూ.300 జీతం. ఈ నేపథ్యంలోనే కామర్స్ చదివిన గోయల్‌కు పలు విదేశీ విమానయాన సంస్థల్లో పనిచేసేందుకు అవకాశాలు లభించాయి.
1969లో ఇరాకీ ఎయిర్వేస్ పబ్లిక్ రిలేషన్ మేనేజర్‌గా నియమితులయ్యారు. 1971 నుంచి 1974 వరకు రాయల్ జోర్డానియన్ ఎయిర్‌లైన్స్, మిడిల్ ఈస్ట్ ఎయిర్లైన్స్ల్లోనూ పనిచేశారు. ఆ తర్వాత తనకున్న ట్రావెల్ ఏజెన్సీ అనుభవంతో తల్లి నుంచి కొంత నగదును తీసుకుని 1974లోనే జెట్ ఎయిర్ పేరిట సొంతంగా ఓ ట్రావెల్ ఏజెన్సీని పెట్టారు. ఎయిర్ ఫ్రాన్స్, ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్, క్యాథే పసిఫిక్ వంటి భారీ సంస్థలతో కలిసి సాగారు. ఇదే సమయంలో 1975లో దేశంలోని ఫిలిప్పీన్స్ ఎయిర్‌లైన్స్ రీజినల్ మేనేజర్‌గా నియమితులయ్యారు. అలాఅలా.. 1992 ఏప్రిల్ 1న ముంబై కేంద్రంగా జెట్ ఎయిర్వేస్ను స్థాపించారు. గోయల్‌కు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.
ఏమిటీ కేసు?
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్‌లో రూ.538 కోట్ల మోసానికి పాల్పడ్డారని నరేశ్ గోయల్, ఆయన భార్య అనితతోసహా ఇతర జెట్ ఎయిర్వేస్ మాజీ ఉద్యోగులపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీని ఆధారంగానే మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు దాఖలు చేసింది. బ్యాంక్ రుణ నిధులను మళ్లించారని, వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించింది. ఈ క్రమంలోనే గత ఏడాది సెప్టెంబర్ 1న గోయల్ అరెస్టయ్యారు. ప్రస్తుతం ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను నిరుడు నవంబర్‌లో బాంబే హైకోర్టు కొట్టేసింది. అంతకుముందు సెప్టెంబర్‌లో అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్న తన వైద్యానికి తమ కుటుంబ వైద్యులను, తిండికి ఇంటి భోజనాన్ని అనుమతించాలంటూ చేసిన అభ్యర్థనను ఈడీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.
చచ్చిపోవాలనుంది..
నేను జీవితంపై అన్ని ఆశల్నీ కోల్పోయాను. ఈ పరిస్థితిలో ఇలా బతికే కన్నా చావడం మేలు. జైల్లోని ఇతర ఖైదీలతో కలిసి జేజే ప్రభుత్వ దవాఖానకు వెళ్తున్నాను. అక్కడ లైన్లలో నిలబడి వైద్యం చేయించుకోవాల్సి వస్తున్నది. ఇది నావల్ల కావడం లేదు. కోర్టు విచారణలకు హాజరయ్యేందుకు కూడా నా ఆరోగ్యం సహకరించడం లేదు. శరీరం మొత్తం వణికిపోతున్నది. నిలబడేందుకూ ఇంకొకరి సాయం కావాల్సి వస్తున్నది. దయచేసి జైల్లోనే చచ్చిపోయేందుకు నాకు అనుమతివ్వండి. అందుకు బదులుగా నన్ను ఆ దవాఖానకే పంపించాలని మాత్రం ఆదేశించకండి.
-కోర్టులో న్యాయమూర్తిని కన్నీటితో వేడుకున్న గోయల్