Jeff Bezos Marriage | ప్రపంచ కుబేరుల్లో ఒకరు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. మాజీ టీవీ జర్నలిస్ట్ లారెన్ సాంచెజ్ను పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే. జూన్ చివరి వారంలో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం. జూన్ నుంచి 24 నుంచి 26 వరకు వెనిస్లో వివాహం జరుగున్నట్లు తెలుస్తున్నది. వివాహం తేదీ, వేదికను గోప్యంగా ఉంచినా.. ఇటలీలోని వెనిస్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాంతో జెఫ్ బెజోస్ పెళ్లి ఏర్పాట్లేనని తేలింది.
కానీ, వెనిస్లోని స్థానికులు పెళ్లికి భారీ ఏర్పాట్లు చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హై ప్రొఫైల్ వివాహం ఇప్పటికే రద్దీగా, పర్యాటకులు ఇబ్బంది పడుతున్న నగరంలో మరింత రద్దీ పెరుగుతుందని పేర్కొంటున్నారు. ఈ సందర్భంలో స్థానికులు నో స్పేస్ ఫర్ జెబోస్ పేరుతూ నిరసనలు ప్రారంభించారు. శాన్ జార్జియో ద్వీపంలోని చర్చి స్టీపుల్పై నో స్పేస్ ఫర్ జెజోస్ అనే బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. లా మిసెరికార్డియా అనే ఈవెంట్ హాల్లో వివాహం జరగవచ్చని నిరసన నిర్వాహకురాలు ఫెడెరికా టోనినెల్లో పేర్కొన్నారు.
జెబోస్ అక్కడికి చేరుకోలేరంటూ ఆమె హెచ్చరించారు. తాము తమ శవాలతో రోడ్లను.. పడవలు, లైఫ్సేవర్స్తో కాలువలను దిగ్భందిస్తామన్నారు. మరో నిరసనకారుడు నా హబీ స్టెల్లా ఫే మాట్లాడుతూ.. 10 మిలియన్ డాలర్ల వివాహాన్ని ఆపేందుకు అవకాశం ఉందని.. దాన్ని అడ్డుకోవాల్సిందేనన్నారు. అయితే, వెనిస్కు చెందిన ప్రతిపక్ష నేత గియోవన్నీ ఆండ్రియా మార్టిని మాట్లాడుతూ.. ఈ వివాహం వెనిస్ ‘డిస్నీఫికేషన్’కు ఉదాహరణ.. ఇది సాధారణ వెనీషియన్లకు ప్రయోజనం చేకూర్చదన్నారు. అసౌకర్యం కలుగుతుందన్నారు. తీవ్రమవుతున్న నిరసనల మధ్య, వెనిస్ మేయర్ లుయిగి బ్రుగ్నారో బెజోస్‌కు మద్దతుగా నిలిచారు.
నిరసనలు సిగ్గుచేటుగా అభివర్ణించారు. ఈ వివాహం నగరానికి ఎలాంటి హాని ఉండదన్నారు. 200 మంది అతిథులను మాత్రమే ఆహ్వానిస్తారని, కాబట్టి నగర వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆయన అన్నారు. జెఫ్ బెజోస్ 1993లో మెకెంజీ స్కాట్‌ను వివాహం చేసుకున్నారు. దాదాపు 25 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. 2019లో విడాకులు తీసుకొని విడిపోయారు. బెజోస్, మెకెంజీకి నలుగురు పిల్లలు ఉన్నారు. బెజోస్ లారెన్ సాంచెజ్ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వెనిస్లో జరగనున్న ఈ గ్రాండ్ వివాహానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.