Hindenburg on Block | యూఎస్ షార్ట్ షెల్లింగ్ కంపెనీ హిండెన బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) నివేదిక దెబ్బకు అదే దేశానికి చెందిన ఫైనాన్సియల్ సర్వీసెస్, మొబైల్ బ్యాంకింగ్ సంస్థ ‘బ్లాక్’ విలవిల్లాడిపోయింది. ట్విట్టర్ ఫౌండర్ జాక్ డోర్సీ స్థాపించిన ఈ ‘బ్లాక్’ లావాదేవీలు పూర్తిగా అవకతవకల మయం అని గురువారం పేర్కొన్నది. దీంతో సంస్థ షేర్లతోపాటు దాని ఫౌండర్ జాక్ డోర్సీ సంపద కూడా భారీగా కొడిగట్టుకుపోయింది. హిండెన్‌బర్గ్ నివేదిక వెల్లడి కాగానే బ్లాక్ షేర్లు గురువారం ఒకానొక దశలో 22 శాతం నష్టపోయి చివరకు 15 శాతం నష్టంతో స్థిర పడ్డాయి.
మరోవైపు, బ్లాక్ ఫౌండర్‌గా జాక్ డోర్సీ వ్యక్తిగత సంపద కూడా 526 మిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో సుమారు రూ.4327 కోట్లు ఆవిరై పోయాయని బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. దీని ప్రకారం జాక్ డోర్సీ వ్యక్తిగత సంపద 11 శాతం పతనమై 4.4 బిలియన డాలర్లతో సరిపెట్టుక్నుది. బ్లాక్‌లోని మెజారిటీ షేర్లలోనే జాక్ డోర్సీ వ్యక్తిగత సంపద ముడి పడి ఉన్నది. ప్రస్తుతం ఆయన వ్యక్తిగత సంపద 4.4 బిలియన డాలర్లలో షేర్ల వాటా 300 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక సోషల్ మీడియా జెయింట్ ట్విట్టర్లోనూ జాక్ డోర్సీకి 388 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు ఉన్నాయి.
‘బ్లాక్’ నిర్వాహకులు భారీగా అక్రమాలకు తెగబడ్డారని హిండెన్‌బర్గ్ గురువారం ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎక్కువ సంఖ్యలో ఖాతాదారులను చూపి, షేర విలువ కూడా కృత్రిమంగా పెంచి ఇన్వెస్టర్లు, ప్రభుత్వాన్ని బ్లాక్ నిర్వాహకులు మోసగిస్తున్నారని అభియోగం. బ్లాక్ వినియోగదారుల్లో అత్యధికులు నేరగాళ్లు, అక్రమ వ్యాపార లావాదేవీలు జరిపే వారేనని పేర్కొంది. అంతే కాదు సంస్థ ఖాతాల్లో 40-75 శాతం నకిలీవని బ్లాక్ మాజీ ఉద్యోగులు తమకు చెప్పారని హిండెన్‌బర్గ్ తెలిపింది.
గతంలో 2020లో విద్యుత్ కార్ల తయారీ సంస్థ నికోలాపైన కూడా హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు చేసింది. దీంతో ఆ కంపెనీ షేర విలువ భారీగా పతనమైంది. ఆరోపణలపై జరిపిన విచారణలో నికోలా వ్యవస్థాపకుడు ట్రెవర్ మిల్టన్ అక్రమాలు చేశారని తేలింది. గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ తన షేర్ల ట్రేడింగ్‌లో అవకతవకలకు పాల్పడుతున్నదని, ఖాతాల్లోనూ ఫ్రాడ్ చేస్తున్నదని హిండెన్‌బర్గ్ గత జనవరి 24న ఆరోపించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి అదానీ గ్రూప్ లిస్టెడ్ సంస్థల షేర్లు భారీగా పతనం అయ్యాయి. అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 140 బిలియన్ డాలర్లకు పైగా కొడిగట్టుకుపోయింది. అప్పటి వరకు గ్లోబల్ బిలియనీర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగిన గౌతం అదానీ వ్యక్తిగత సంపద కూడా భారీగా హరించుకపోయింది.