Banks Festive Offers | పండుగల సీజన్ వస్తోంది. కరోనా నేపథ్యంలో డిమాండ్ పెంచడానికి వివిధ రుణాలపై బ్యాంకుల వడ్డీరేట్లు రికార్డు స్థాయిలో దిగి వచ్చాయి. తాజాగా గిరాకీ క్రమంగా పుంజుకోవడంతో పలు బ్యాంకులు తమ ఖాతాదారులకు ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. పండుగల సీజన్ కోసం బ్యాంకులు వివిధ రుణాలపై వడ్డీరేట్లు మరింత తగ్గించాయి.
ఫెస్టివ్ ఆఫర్‌గా ఇంటి రుణాలపై 6.7 శాతం వడ్డీరేట్ ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. రుణ గ్రహీతలు తీసుకునే రుణం మొత్తంతో సంబంధం లేకుండా ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఇంతకుముందు కొటక్ మహీంద్రా బ్యాంక్ ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లను 6.5 శాతానికి తగ్గించి వేసిన సంగతి తెలిసిందే.
సాధారణంగా రుణ గ్రహీత ప్రొఫెషన్‌ను బట్టి రుణాలపై వడ్డీరేట్లు ఖరారవుతాయని ఎస్బీఐ రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎస్ శెట్టి చెప్పారు. కానీ ఈ దఫా సదరు ఖాతాదారు వృత్తితో సంబంధం లేకుండా ఒకే వడ్డీరేటుపై రుణాలిస్తున్నట్లు తెలిపారు.
ఈ నిబంధన వేతనేతర ఖాతాదారులకు కూడా వర్తిస్తుంది. ఇంతకుముందు వేతన జీవులతో పోలిస్తే మిగతా వారికి ఇచ్చే రుణాలపై 15 బేసిక్ పాయింట్లు వడ్డీరేట్లు ఎక్కువ. ఇక ఫెస్టివ్ లోన్ ఆఫర్‌గా ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది.
ఎస్బీఐతోపాటు కొటక్ మహీంద్రా బ్యాంకు సంబంధిత రుణ గ్రహీత క్రెడిట్ స్కోర్‌ను బట్టి రుణాలపై ఆఫర్లు అందుబాటులోకి తెస్తున్నాయి. ఫ్రెష్ హోం లోన్స్, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ రుణాలపై వడ్డీరేటు ఇప్పుడు 6.5 శాతం నుంచి ప్రారంభం అవుతున్నాయి. రుణ గ్రహీత క్రెడిట్ ప్రొఫైల్‌ను బట్టి అన్ని రుణాలపై ప్రత్యేకమైన వడ్డీరేటు ఆఫర్ చేస్తున్నామని కొటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది.
ఈ నెల 10 నుంచి నవంబర్ 8 వరకు కొటక్ మహీంద్రా బ్యాంక్ ఇంటి రుణంపై 6.5 శాతం వడ్డీరేటు విధిస్తున్నది. ఇది ఫ్రెష్ రుణాలకు, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ రుణాలకూ వర్తిస్తుందని కొటక్ మహీంద్రా బ్యాంక్ తెలిపింది.
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకర్ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుల పంపిణీ కోసం ఫిన్‌టెక్ కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంది. దీని ప్రకారం ప్రతి నెలా 3లక్షల క్రెడిట్ కార్డులు విక్రయించగలమని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఆశాభావంతో ఉంది. అయితే, ఈ బ్యాంకుపై రెగ్యులేటరీ ఆంక్షలను ఆర్బీఐ ఎత్తివేయాల్సి ఉంది.
మరో ప్రభుత్వ రంగ బ్యాంక్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) అన్ని రకాల రుణాలు, రిటైల్ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు, సర్వీస్ చార్జీలను మినహాయించింది. కార్లు, ఇండ్ల రుణాలపై బ్యాంక్ ఆఫ్ బరోడా 25 బేసిక్ పాయింట్ల వడ్డీ తగ్గించింది.