ITR Forms-CBDT | ప్రస్తుత ఆర్థిక సంవత్సరా (2023-24)నికి ఆదాయం పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి అవసరమైన ఫామ్లను మూడు నెలల ముందే కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఫారాలను నోటిఫై చేసింది. గత ఆర్థిక సంవత్సర (2022-23) ఐటీఆర్ ఫామ్లను గత ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన తర్వాత విడుదల చేసిన సీబీడీటీ ఈసారి సుమారు మూడు నెలల ముందే నోటిఫికేషన్ జారీ చేయడం ఆసక్తి కర పరిణామం.
సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఐటీఆర్ ఫామ్లపై సీబీడీటీ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. గత ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ ఇవ్వగా, ఈ ఏడాది డిసెంబర్లోనే జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ఆదాయంపై వేతన జీవులు, వ్యాపారులు, స్వయం ఉపాధిపై జీవిస్తున్న వారు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ లు వచ్చే ఏడాది జూలై 31 తేదీలోగా ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుందని సీబీడీటీ తెలిపింది.
వేతన జీవులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయంపై వచ్చే ఏడాది (2024-25) అంచనా సంవత్సరం అంచనా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. వ్యక్తులు తమ వ్యక్తిగత వార్షిక ఆదాయం రూ.50 లక్షలు దాట కుంటే ఐటీఆర్-1 (సహజ్) ఫామ్ ఎంపిక చేసుకోవాలి. రూ.50 లక్షల్లోపు ఆదాయం గల హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థలు ఐటీఆర్-4 (సుగమ్) ఫామ్ ఎంచుకోవాల్సి ఉంటుంది.