హైదరాబాద్, ఏప్రిల్ 6: ప్రముఖ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్, విడిభాగాల తయారీ సంస్థ ఐటీపీ ఏరో..బుధవారం హైదరాబాద్‌లో సరికొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. భాగ్యనగరంలోని ఐడీఏ గాంధీనగర్‌లోని సంస్థ ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఏరోస్పేస్, డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ పీఏ, ఐటీపీ ఎక్స్టర్నల్ ఎండీ జీసస్ కాటలీనా, ఐటీపీ ఎక్స్టర్నల్ ఇండియా ఎండీ వంశీ కృష్ణలు సంయుక్తంగా ప్రారంభించారు. ఐటీపీ ఏరో అనుబంధ సంస్థయైన ఐటీపీ ఎక్స్టర్నల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భారత్‌లో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్న ఆఫీస్‌లో 160 మంది టెక్నాలజీ నిపుణలు విధులు నిర్వహిస్తుండగా, ఈ కొత్త ఆఫీస్ కోసం ఈ సంఖ్యను రెట్టింపు చేయనున్నట్లు ఐటీపీ ఎక్స్టర్నల్ ఎండీ జీసస్ కాటలీనా తెలిపారు.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో ప్రత్యేకంగా ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ల కోసం దృఢమైన ట్యూబులు ఉత్పత్తి చేస్తున్నట్లు, భవిష్యత్తులో వీటికి డిమాండ్ ఉంటుందన్న అంచనాతో ఈ యూనిట్ సామర్థ్యాన్ని పెంచుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ..ఏరోస్పెస్, విమానయాన రంగానికి తెలంగాణ రాష్ట్రం దేశంలో ఉత్తమ రాష్ట్రంగా నిలిచిందని, విమానయాన రంగానికి హబ్‌గా హైదరాబాద్ తయారైందని చెప్పారు.