న్యూఢిల్లీ, నవంబర్ 15: ఐటీ రంగ షేర్లు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. గడిచిన ఏడాదికాలంలో ఐటీ రంగ షేర్లు భారీగా పతనం చెందాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలతో దేశీయ ఐటీ సంస్థలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. దీంతో దేశీయ ఐటీ కంపెనీల షేర్లు నేల చూపులు చూస్తున్నాయి. ప్రధానంగా ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రోతోపాటు ఇతర సంస్థల షేర్లు కిందకు పడిపోతున్నాయి. ప్రధాన సూచీల్లో ఒకటైన నిఫ్టీ ఇండెక్స్‌లో ఐటీ రంగ సూచీలు భారీగా పతనం చెందింది.
వీటితోపాటు పవర్, ఆటోమొబైల్ రంగానికి చెందిన షేర్లు కూడా పతనం చెందాయి. కానీ, ఫైనాన్షియల్ రంగ షేర్లు మాత్రం అంచనాలకుమించి రాణించాయి. నిఫ్టీ ఇండెక్స్‌లో 9.91 శాతం వాటా కలిగిన ఐటీ రంగ సూచీల్లో ఇన్ఫోసిస్ అత్యధికంగా 4.53 శాతం వాటా కలిగివుండగా, టీసీఎస్‌కు 2.65 శాతం ఉన్నది. మిగతా వాటా హెచ్‌సీఎల్ టెక్నాలజీ, విప్రో, టెక్ మహీంద్రాలకు ఉన్నది. గతేడాదికాలంలో ఇన్ఫోసిస్ షేరు 18 శాతం పతనం చెందగా, టీసీఎస్ 27 శాతం చొప్పున పతనం చెందాయి.
ఐటీ రంగంతోపాటు విద్యుత్ రంగ షేర్లు కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. నిఫ్టీ ఇండెక్స్‌లో 2.27శాతం వాటా కలిగిన ఈ రంగ షేర్లలో 20 శాతం వరకు తగ్గాయి. వీటిలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా షేర్లు 19 శాతం వరకు తగ్గాయి. మరోవైపు, ఆర్థిక రంగ షేర్లు కదంతొక్కాయి. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో అత్యధికంగా ఆర్థిక సేవల రంగ షేర్లకు 36.33 శాతం వాటా కలిగివుండగా, ఆయిల్ అండ్ గ్యాస్ 10.12 శాతం, ఆటో-ఆటో కంపొనెంట్ 6.8 శాతం, ఎఫ్ఎంసీజీ 6.7 శాతంగా ఉన్నాయి. ఆటోమొబైల్ రంగ షేర్లలో టాటా మోటర్స్ అత్యధికంగా 49 శాతం పతనం చెందింది. కన్జ్యూమర్ డ్యూరబుల్, టెలికం రంగ షేర్లు లాభపడ్డాయి.
ఆర్థిక రంగ షేర్లు లాభపడ్డాయి. వీటిలో బజాజ్ ఫైనాన్స్ 48 శాతం రిటర్ను పంచగా.. ఎస్బీఐ లైఫ్ 28 శాతం, కొటక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. వీటితోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐలు కూడా మెరుగైన పనితీరు కనబరిచాయి. వచ్చే ఏడాదిలో కూడా నిఫ్టీ ఇండెక్స్ ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకోనున్నదని అవుట్‌లుక్‌లో పేర్కొంది. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, 5-7% మధ్యలో వృద్ధి పరిమితంకానున్నట్టు వెల్లడించింది.
