న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగం వృద్ధి మందగిస్తుందని, దీంతో వచ్చే మూడు త్రైమాసికాల్లో ఈ కంపెనీల్లో నియామకాలు అంతంతమాత్రంగానే ఉంటాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. 2023-24లో ఐటీ రంగం వృద్ధి 3-5 శాతానికి పరిమితమవుతుందని, 2024-25లో 6 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. ఐటీ పరిశ్రమ 2022-23లో 9.2 శాతం వృద్ధిచెందింది. ఐటీ సేవలకు డిమాండ్ బలహీనంగా ఉన్నందున, ప్రస్తుత సిబ్బంది నుంచే గరిష్ఠ ఉత్పాదకతను రాబట్టుకోవడంలో కంపెనీలు దృష్టిపెడతాయని పేర్కొంది. ఐటీ రంగానికి పెద్ద మార్కెట్లయిన యూఎస్, యూరప్‌లు స్థూలఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయన్నది. దేశీయ ఐటీ రంగానికి 60 శాతం ఆదాయాన్ని ఇచ్చే యూఎస్‌లో ఇటీవలి త్రైమాసికాల్లో డిమాండ్ నెమ్మదిస్తున్నదని తెలిపింది. యూఎస్‌కంటే యూరప్ మార్కెట్ కాస్త స్థిరంగా ఉన్నప్పటికీ, అక్కడ కూడా వృద్ధి పరిమితంగానే ఉంటున్నదని వెల్లడించింది.
తగ్గుతున్న వలసలు
ఐటీ పరిశ్రమలో ఉద్యోగుల వలసలు గత ఏడాది మూడో త్రైమాసికం నుంచి తగ్గుతున్నాయని ఇక్రా తెలిపింది. 2020-21 నాల్గవ త్రైమాసికం నుంచి 2022-23 రెండవ త్రైమాసికం వరకూ వలసలు విపరీతంగా పెరిగాయన్నది. ఈ నేపథ్యంలో గతంలో నియామకాలు జోరుగా జరిపిందున, ఆయా కంపెనీల వేతన బిల్లులు పెరిగి, ఆపరేటింగ్ లాభాల మార్జిన్లపై ప్రభావం పడుతున్నదని వివరించింది.