హైదరాబాద్, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ): రానున్న రోజుల్లో రాష్ట్రంలో 400 గ్లోబల్ కెపబులిటీ సెంటర్లు(జీసీసీ) ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 220కి పైగా జీసీసీలు ఉండగా, సమీప భవిష్యత్తులో వీటిని రెండింతలు పెంచడం ద్వారా బెంగళూరును అధిగమించాలని సంకల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.
‘టెక్‌వేవ్’ హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన అత్యాధునిక జీడీసీను శనివారం శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డిజిటల్ రంగంలో సాధికారిత సాధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి ఇది ఎంతో దోహదపడుతున్నదన్న ఆశాభావం వ్యక్తంచేశారు.
ఇందుకు అవసరమైన ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు, ఇందులో టెక్‌వేవ్ ఏర్పాటుచేసిన జీడీసీ కీలకపాత్ర పోషించనున్నదన్నారు. టెక్వేవ్కు హైదరాబాద్ కార్యాలయంలో ప్రస్తుతం 2,400 మంది ఉద్యోగులు, అలాగే ఖమ్మంలో మరో 500 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. తాజాగా లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన ఈ గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్‌తో మరో 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని టెక్‌వేవ్ సహ వ్యవస్థాపకులు, చైర్మన్ జీ దామోదర్ రావు తెలిపారు.