
బంజారాహిల్స్(నమస్తే తెలంగాణ), డిసెంబర్ 10: టెలిమెడిసిన్ రంగంలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్న అపోలో టెలిహెల్త్ సంస్థకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఐఎస్వో 13131:2021 గుర్తింపు లభించింది. హైదరాబాద్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అపోలో చైర్మన్ డా. ప్రతాప్.సీ.రెడ్డి, అపోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డా.సంగీతారెడ్డి, అపోలో టెలిహెల్త్ సంస్థ సీఈవో విక్రమ్ తప్లూ తదితరులు వివరాలు వెల్లడించారు. బ్రిటిన్‌కు చెందిన బ్రిటిష్ స్టాండర్డ్స్ ఇనిస్టిట్యూషన్(బీఎస్ఐ) అందించే ఐఎస్వో 13131 గుర్తింపు అపోలో టెలిహెల్త్ సంస్థకు దక్కడం ఆనందంగా ఉందని అపోలో గ్రూపు చైర్మన్ ప్రతాస్ సీ రెడ్డి పేర్కొన్నారు. నాణ్యమైన వైద్యసేవలు అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో నివాసం ఉంటున్న సుమారు 1.35 కోట్ల మంది వినియోగదారులకు టెలీహెల్త్ సేవలు అందించామని వివరించారు. ఈ రంగంలో అత్యంత నాణ్యమైన సేవలకు గుర్తింపుగా ప్రపంచంలోనే తొలిసారిగా తమకు ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించడం ఆనందంగా ఉందన్నారు. కోవిడ్ సమయంలో టెలిమెడిసన్కు మంచి ఆదరణ లభించిందని, ఈ సమయంలో టెలిమెడిసిన్‌ను ఉపయోగించుకున్న వారిలో 67శాతం మంది కొత్తవారే ఉండటం విశేషం.