Samsung | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు పెరుగుతుండటంతో స్మా్ర్ట్ ఫోన్ల తయారీ సంస్థలు కూడా తమ కొత్త ఫోన్లలో ఏఐ ఫీచర్లు జత చేస్తున్నాయి. శాంసంగ్, ఆపిల్, మోటరోలా తదితర కంపెనీలు సొంతంగా ఏఐ ఫీచర్లు తీసుకొచ్చాయి. అయితే వీటిని కొంత కాలం మాత్రమే ఫ్రీగా అందిస్తామని శాంసంగ్ తెలిపింది. స్మార్ట్ ఫోన్లలో ఏఐ ఫీచర్ల వినియోగ గడువు దాటాక కొంత ఫీజు వసూలు చేయాలని శాంసంగ్ సంకల్పించింది. గత జనవరిలో మార్కెట్లో ఆవిష్కరించిన శాంసంగ్ ఎస్24 సిరీస్ ఫోన్లలో తొలిసారి ఏఐ ఫీచర్లు జత చేసింది. వచ్చే ఏడాది చివరి వరకూ కొన్ని ఫీచర్లు ఉచితంగా అందిస్తామన్న శాంసంగ్.. ఇటీవల శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ ఆవిష్కరణ సమయంలో మాత్రం 2025 చివరి నుంచి ఏఐ ఫీచర్లకు కొంత ఫీజు ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో మరొక ఏడాది పాటు మాత్రమే ఏఐ ఫీచర్లు ఉచితంగా యూజర్లకు అందించనున్నట్లు తేల్చి చెప్పింది శాంసంగ్.
శాంసంగ్ అందించిన ఏఐ ఫీచర్లలో నోట్ అసిస్టెంట్ ముఖ్యమైంది.. దీంతో ఆడియో రికార్డు చేసి ట్రాన్స్ స్క్రైబ్ చేయవచ్చు. స్కెచ్ టూ ఇమేజ్ ఫీచర్ సాయంతో యూజర్ గీసిన డ్రాయింగ్, గ్యాలరీలోని ఫోటో ఆధారంగా ఇమేజ్ తయారు చేయొచ్చు. వీటితోపాటు సర్కిల్ టూ సెర్చ్, పీడీఎఫ్ టెక్ట్స్ ట్రాన్స్ లేట్ తదితర ఫీచర్లు ఉన్నాయి.