IPOs 2024 | పరిశ్రమల నిర్వహణకు నిధులు అవసరం.. సొంత వనరులతో సంస్థ ప్రారంభించినా.. సేవల విస్తరణకు నిధుల సేకరణ తప్పనిసరి. అందుకు స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ ఒక మార్గం. ఈక్విటీ మార్కెట్లలో లిస్టింగ్ కావాలంటే ఆయా సంస్థలు ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వెళ్లాల్సి ఉంటుంది. అందుకు అనుకూల మార్కెట్ పరిస్థితులు, రెగ్యులేటరీ నిబంధనలు సానుకూలంగా ఉండాల్సి ఉంటుంది. గతంతో పోలిస్తే మార్కెట్లో సానుకూల పరిస్థితులు, రెగ్యులేటరీ నిబంధనల్లో పురోగతితో పలు సంస్థలు ఐపీఓకు వెళుతున్నాయి.
ఐపీఓల ద్వారా నిధుల సేకరణలో దేశీయ కార్పొరేట్ సంస్థలు, స్టార్టప్ సంస్థలు మరో మైలురాయిని దాటాయి. స్టాక్ మార్కెట్లలో ఆయా కంపెనీల లిస్టింగ్.. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి సంకేతంగా నిలుస్తుంది. ఈ ఏడాది 90 కంపెనీలు ఐపీఓ ద్వారా రికార్డు స్థాయిలో రూ.1.6 లక్షల కోట్ల నిధులు సేకరించాయి. 2025లోనూ ఐపీఓల ద్వారా భారీగా నిధులు సమకూర్చుకునేందుకు పలు కంపెనీలు క్యూ కడుతున్నాయి. దీర్ఘకాలిక వృద్ధి లక్ష్యంతో ఐపీఓలతో షేర్లు జారీ చేసిన సంస్థల విశ్వాసంతోపాటు లిస్టింగ్ లాభాల కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూడటం ఈ ఏడాదిలో అసాధారణమనే చెప్పాలి.
దేశ చరిత్రలో అత్యధికంగా దక్షిణ కొరియా ఆటోమొబైల్ కంపెనీ హ్యుండాయ్ మోటార్ ఇండియా ఐపీఓ ద్వారా రూ.27,870 కోట్ల నిధులు సేకరించింది. ఈ ఏడాది దేశ చరిత్రలోనే అతి పెద్ద ఐపీఓగా నిలుస్తుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ రీత్యా చిన్న, మధ్య, భారీ పరిశ్రమలు ఐపీఓల ద్వారా రూ.867 కోట్ల నుంచి రూ.1700 కోట్ల వరకూ నిధులు సేకరించాయి. ఇక ప్రైవేట్ టెలికం ఆపరేటర్ సంస్థ వొడాఫోన్ ఐడియా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్పీఓ) ద్వారా రూ.18 వేల కోట్ల నిధులు సేకరించింది.
హ్యుండాయ్ మోటార్స్: రూ.27,870 కోట్లు.
స్విగ్గీ : రూ.11,327 కోట్లు.
ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ : రూ.10 వేల కోట్లు.
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రూ.6,560 కోట్లు.
ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ: రూ.6,145 కోట్లు.
అతి చిన్న ఐపీఓ : విభోర్ స్టీల్ ట్యూబ్స్ – రూ.72 కోట్లు.
నిధుల సేకరణలో చిన్నదైనా విభోర్ స్టీల్ ట్యూబ్స్ ఐపీఓ 320 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్ అండ్ రిఫ్రిజిరేషన్, మన్బా ఫైనాన్స్ అండ్ గాలా ప్రిసిషన్ ఇంజినీరింగ్ ఐపీఓలు 200పై చిలుకు రెట్లు సబ్స్క్రైబ్ అయ్యాయి. వన్ మొబిక్విక్ సిస్టమ్స్, యూనీ కామర్స్ ఈ-సొల్యూషన్స్, డిఫ్యూజర్ ఇంజినీర్స్, బీఎల్ఎస్ ఈ-సర్వీసెస్, ఎగ్జిమ్ టెలీ సిస్టమ్స్ ఐపీఓల్లో 100 రెట్లు సబ్స్క్రిప్షన్లు నమోదయ్యాయి. 60కి పైగా కంపెనీలు స్టాక్ మార్కెట్లలో లిస్టయిన రోజే పాజిటివ్ ఫలితాలు అందుకోవడం ఓ రికార్డుగా నిలిచింది. విభోర్ స్టీ్ల్ ట్యూబ్స్, బీఎల్ఎస్ ఈ సర్వీసెస్, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్ తదితర సంస్థలు లిస్టింగ్ రోజు 100 శాతానికి పైగా లబ్ధి పొందాయి.
కేవలం ఈ నెలలోనే 15 సంస్థలు ఐపీఓకు వెళ్లడం ఒక అసాధారణ ప్రక్రియ కానున్నది. ఈ నెల 23,24 తేదీల్లో మరో ఎనిమిది సంస్థల ఐపీఓలు మార్కెట్లలోకి రానున్నాయి. పరిస్థితులు ఇలాగే సాగితే వచ్చే ఏడాది 75 సంస్థల యాజమాన్యాలు ఐపీఓల ద్వారా రూ.2.5 లక్షల కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. వాటిల్లో హెచ్డీబీ ఫైనాన్సియల్ సర్వీసెస్ రూ.12,500 కోట్లు, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ రూ.15 వేల కోట్ల విలువైన ఐపీఓలు ఉన్నాయి. 2023లో 67 కంపెనీలు ఐపీఓల ద్వారా కేవలం రూ.49,436 కోట్ల నిధులు సేకరించాయి. 2021లో కేవలం 63 కంపెనీలు రూ.1.2 లక్షల కోట్ల నిధుల సేకరణ గత రెండు దశాబ్దాల్లోనే ‘బెస్ట్ ఐపీఓ ఇయర్’గా నిలుస్తుంది.