IPhone 14 Launching | టెక్ దిగ్గజం ఆపిల్ ఫ్లాగ్షిప్ ఫోన్.. ఐ-ఫోన్14 సిరీస్ ఫోన్లు వచ్చేనెలలో ఆవిష్కరించనున్నది. వచ్చేనెల ఏడో తేదీన కంపెనీ ఆవిష్కరిస్తుందని సమాచారం. ఐఫోన్14 సిరీస్‌లో ఐఫోన్-14తోపాటు ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడల్ ఫోన్లు కూడా ఉంటాయని తెలుస్తున్నది.
మొత్తం ఆపిల్ సేల్స్‌లో ఐఫోన్ వాటా దాదాపు 50 శాతం ఉంటుందని తెలుస్తున్నది. ఐఫోన్14 సిరీస్ ఫోన్లతోపాటు మరికొన్ని ఉత్పత్తులను ఆపిల్ మార్కెట్లోకి తెస్తుందని సమాచారం. ఫుల్ రేంజ్ న్యూ మ్యాక్ లాప్టాప్, డెస్క్‌టాప్ కంప్యూటర్లు, ఆపిల్వాచ్, ఐపాడ్స్ వేర్వేరు ధరలకు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ఐఫోన్-13 తరహాలోనే ఐఫోన్-14 స్టాండర్డ్ మోడల్ ఫోన్ ఉంటుందని భావిస్తున్నారు.
ఐఫోన్-14 ఫోన్ ధర 799 డాలర్లు (రూ.64 వేలు) ఉంటుందని సమాచారం. ఐఫోన్-14 ప్రో, ఐఫోన్-14 ప్రో మ్యాక్స్ ఫోన్ల ధరలు 100 డాలర్లు (సుమారు రూ.8000) ఎక్కువ ఉండొచ్చునని చెబుతున్నారు. ఐఫోన్-14 సిరీస్ ఫోన్లు ఆరు రంగుల్లో లభిస్తాయి. బ్లాక్, బ్లూ, గ్రీన్, పర్పుల్, రెడ్, వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీంతోపాటు ఐఫోన్ ప్రో.. గ్లోడ్, గ్రాఫైట్, గ్రీన్, పర్పుల్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో ఉంటుందని తెలుస్తున్నది.