Investors wealth | యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు తగ్గించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఫలితంగా శుక్రవారం ఒక్కరోజే బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపద రూ.6.24 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈ చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 84 వేల మార్కును దాటేసింది. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 1,359.51 పాయింట్ల లబ్ధితో 84,544.31 పాయింట్ల వద్ద ముగిసింది. అంతకుముందు అంతర్గత ట్రేడింగ్లో బీఎస్ఈ సెన్సెక్స్ 1509.66 పాయింట్లు పుంజుకుని 84,694.46 పాయింట్ల జీవిత కాల గరిష్టానికి చేరుకున్నది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,24,468.11 కోట్లు వృద్ధి చెంది రూ.4,71,71,745.83 కోట్ల (5.65 లక్షల కోట్ల డాలర్లు) కు చేరుకున్నది.
బీఎస్ఈ -30 ఇండెక్స్ లో మహీంద్రా అండ్ మహీంద్రా ఐదు శాతానికి పైగా లబ్ధి పొందితే, జేఎస్ డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు, లార్సెన్ అండ్ టర్బో, భారతీ ఎయిర్ టెల్, నెస్లే, అదానీ పోర్ట్స్, హిందూస్థాన్ యూనీ లివర్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, మారుతి సుజుకి, కోటక్ మహీంద్రా బ్యాంకు, టాటా స్టీల్ భారీగా లబ్ధి పొందాయి. మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, బజాజ్ ఫైనాన్స్ నష్టాలతో ముగిశాయి.
బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.37 శాతం, మిడ్ క్యాప్ 1.16 శాతం, రియాల్టీ 3.21, క్యాపిటల్ గూడ్స్ 2.32, ఆటో 2.12, ఇండస్ట్రీయల్స్ 2.08, మెటల్ 1.82, కన్జూమర్ డిస్క్రిషినరీ 1.78, ఫైనాన్సియల్ సర్వీసెస్ 1.55, బ్యాంకెక్స్ 1.44, హెల్త్ కేర్ 1.10 శాతం లాభంతో స్థిర పడ్డాయి. బీఎస్ఈలో 2442 స్టాక్స్ లాభపడగా, 1502 స్టాక్స్ నష్టంతో ముగిశాయి. వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 1653.37 పాయింట్ల లబ్ధితో స్థిర పడింది.