Mid Cap Funds | ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత మొత్తం కుటుంబ భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేస్తుంటారు. రిస్క్ లేని గ్యారంటీ రిటర్న్స్ స్కీమ్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు, రిస్క్ ఉన్నా అధిక లాభాలు గడించాలంటే స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. కొందరు రియాల్టీ రంగంలో.. మరి కొందరు బంగారంపై మదుపు చేస్తుంటారు. ఇంకొందరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడతారు. మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ పెట్టుబడులతో గ్యారంటీ రిటర్న్స్ లభిస్తాయి. గతేడాది కాలంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై 52 శాతానికి పైగా రిటర్న్స్ లభించాయి. రిస్క్ చేయదలుచుకుంటే మిడ్ క్యాప్ ఈక్విటీ ఫండ్స్‌లో మదుపు చేస్తే మంచి రిటర్న్స్ లభిస్తాయి.
మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే.. అందులో మదుపు చేసిన మొత్తం నిధులను మిడ్ క్యాప్ కంపెనీ షేర్లలో పెట్టుబడి పెడతారు. రూ.5000 కోట్ల పై చిలుకు రూ.20 వేల కోట్ల లోపు మార్కెట్ క్యాపిటలైజేషన్ గల కంపెనీలను మిడ్ క్యాప్ కంపెనీలు అని చెబుతారు. మార్కెట్ క్యాపిటలైజేషన్లో 100 నుంచి 200వ వంతు మార్కెట్ క్యాపిటలైజేషన్ గల సంస్థలను కూడా మిడ్ క్యాప్ కంపెనీలు అని పిలుస్తారు.
లార్జ్ క్యాప్ ఫండ్స్ కంటే మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు రిస్క్ ఎక్కువ. తమ ఇన్వెస్ట్మెంట్లపై రిస్క్ తీసుకునే వారు మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేస్తారు. దీనికంటే లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్ లో మంచి పెట్టుబడులు మదుపు చేయొచ్చు. ఐదేండ్ల కంటే ఎక్కువ కాలం మదుపు చేయాలనుకుంటే లాంగ్ టర్మ్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం బెటర్.
ఉదాహరణకు మీ దగ్గర రూ.100 ఉంటే వాటిలో రూ.20-30 వరకు లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేస్తే మేలు. ఒకేసారి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే కంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) కింద ప్రతి నెలా నిర్దిష్ట మొత్తం పెట్టుబడులు పెట్టాలి. దీనివల్ల మార్కెట్ ఒడిదొడుకుల నుంచి రిస్క్ తగ్గుతుంది.