విపత్తు సందర్భాల్లో కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసాను కలిగించేదే జీవిత బీమా. అయితే కొన్నిసార్లు బీమా క్లెయిమ్ సంక్లిష్టంగా మారుతూంటుంది. పాలసీ తీసుకున్న సమయంలో పేర్కొన్న అంశాల్లో లోపాలను ఎత్తిచూపుతూ బీమా కంపెనీలు క్లెయిమ్‌ను తిరస్కరించవచ్చు. అందుకే పాలసీ తీసుకునే ముందు పూర్తిగా తెలుసుకోకుండా దరఖాస్తుల మీద గుడ్డిగా సంతకాలు చేయకండి. మీ తరఫున మరొకరు లేదా బీమా ఏజెంట్ దరఖాస్తు నింపినప్పుడు మరిన్ని తలనొప్పులు వస్తాయి. ఇలాంటి సందర్భాలను తప్పించుకోవాలంటే తెలుసుకోవాల్సిన అంశాలివే..
ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే ముందే దరఖాస్తులో ప్రతి అంశాన్ని పూర్తి వివరాలతో నింపాలి. ముఖ్యంగా ఆరోగ్య స్థితి గురించి. ముందే ఉన్న అనారోగ్య సమస్యలను తప్పనిసరిగా డిక్లేర్ చేయండి. లేదంటే అదే క్లెయిమ్‌కు పెద్ద అడ్డంకి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను కూడా ప్రకటించండి.
మీ చేతికి పాలసీ డాక్యుమెంట్ రాగానే క్షుణ్ణంగా చదవండి. అర్థం కాకపోతే అడిగి తెలుసుకోండి. ఆ పాలసీ మీదనే మీ కుటుంబ భవిష్యత్తు కూడా ఉందని మరవకండి. ఏజెంట్లు చెప్పిన అంశాలను క్రాస్ చెక్ చేసుకోండి. పాలసీ చేతికందిన తర్వాత మీరనుకున్నట్టు లేకపోతే తిరస్కరించేందుకు సమయం ఉంటుంది.
ఏ పాలసీ అయినా ముఖ్యంగా కవరేజీకి సంబంధించిన అంశాన్ని ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేయండి. హెల్త్ పాలసీ అయితే డేకేర్ కవరేజితోపాటు ఏయే జబ్బులకు కూడా వర్తిస్తుందో చూడండి. ప్రీ, పోస్ట్ హాస్పిటలైజేషన్ వ్యయాలనూ కవర్ చేస్తుందో లేదో చూడండి.
కొన్ని బీమా కంపెనీలు మీకు ఇప్పటికే ఉన్న పాలసీల వివరాలను అడగవచ్చు. ముఖ్యంగా లైఫ్ కవరేజీ ఉన్న పాలసీ వివరాలను కోరవచ్చు. కొత్త జీవిత బీమా పాలసీని ఇచ్చే ముందు బీమా సంస్థలు ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని పాలసీని ఇస్తాయి.
జీవిత బీమా లేదా ఆరోగ్య బీమా తీసుకునేప్పుడు ఎందుకు తీసుకుంటున్నామో ఆలోచించండి. ఆకస్మిక మరణం సంభవిస్తే కుటుంబానికి ఆర్థిక అండ కోసం జీవిత బీమాను, అనారోగ్యం పాలైనప్పుడు దవాఖాన ఖర్చులను తగ్గించుకునేందుకు ఆరోగ్య బీమాను తీసుకుంటాం. మీరు తీసుకుంటున్న బీమాలో ఎలాంటి రిస్క్‌ల కవరేజీ వుందో తెలుసుకోండి. జీవిత బీమాలో సర్వైవల్ బెనిఫిట్స్, బోనస్‌లు, మెచ్యూరిటీ, మనీ బ్యాక్ తదితర అంశాలు పరిశీలించండి. ఆరోగ్య బీమాలో ఏ ట్రీట్మెంట్కు ఎంత, హాస్పిటలైజేషన్ ఖర్చులు, సర్జరీ మొదలైన అంశాలకు ఎంతెంత కవరేజీ ఉంటుందో తెలుసుకోండి.