IRDAI | బీమా పాలసీల ప్రాథమిక సమాచారం సంబంధిత పాలసీదారులకు సులువుగా అర్థమయ్యేలా అందించాలని బీమా సంస్థలకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) హితవు చెప్పింది. ఇందుకోసం ఒక ఫార్మాట్‌ను సిద్ధం చేసింది. సంబంధిత బీమా పాలసీలో వచ్చే కవరేజీ, పాలసీ మెచ్యూరిటీ తర్వాత వచ్చే హామీ తదితర వివరాలు అందులో స్పష్టం చేయాలని పేర్కొంది. ఇందుకోసం ఐఆర్డీఏఐ సవరించిన కస్టమర్ ఇన్ఫర్మేసన్ షీట్ జారీ చేసింది. తాజాగా తీసుకొచ్చిన నిబంధన వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని బీమా కంపెనీలకు సర్క్యులర్ జారీ చేసింది.
పాలసీ కొనుగోలుదారులు దాని నిబంధనలు, షరతులు తెలుసుకోవడం ముఖ్యమని ఐఆర్డీఏఐ స్పస్టం చేసింది. ఇందులో పాలసీ డాక్యుమెంట్ కీలకం అని.. అందులో అంశాలు అందరికీ సులువుగా అర్థం అయ్యేలా చెప్పాల్సిన అవసరం ఉందన్నది. బీమా సంస్థ, పాలసీదారుకు మధ్య డిటైల్స్ విషయంలో స్పష్టత లేకపోవడం వల్లే పలు ఫిర్యాదులు వస్తున్నాయని ఐఆర్డీఏఐ తెలిపింది. అందుకే కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ సవరించినట్లు వెల్లడించింది.
దీని ప్రకారం బీమా ప్రొడక్ట్, పాలసీ, పాలసీ నంబర్, ఇన్సూరెన్స్ టైప్, సమ్ అష్యూర్డ్ తదితర ప్రాథమిక సమాచారం ఇవ్వాలి. హెల్త్ బీమా కవరేజీకి సంబంధించి దవాఖానలో ఖర్చులు, ఆ పాలసీలో కవర్ అయ్యేవి, కానివి, వెయిటింగ్ పీరియడ్, కవరేజీ పరిమితులు, క్లయిమ్ ప్రొసీజర్, గ్రీవెన్స్, కంప్లయిట్స్ తదితర వివరాలు చేర్చాలని ఐఆర్డీఏఐ తెలిపింది.