అహ్మదాబాద్, జూన్ 13: దేశ చరిత్రలోనే అత్యంత భయానక విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన గుజరాత్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్సిడెంట్లో బీమా క్లెయిముల చెల్లింపులు రూ.2,400 కోట్లదాకా ఉండొచ్చని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు 242 మందితో బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన సంగతి విదితమే. ఇప్పుడున్న సమాచారం మేరకు మొత్తంగా 265 మంది చనిపోయారు. అలాగే భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్ కంపెనీలపై పెను భారమే పడుతున్నది.
టాటా ఏఐజీతోపాటు మరికొన్ని..
కుప్పకూలిన బోయింగ్ 787-8 విమానం విలువ రూ.18వేల కోట్లకుపైగానే ఉన్నది. ఈ ఫ్లైట్‌లోని వారందరికీ టాటా ఏఐజీ, మరికొన్ని సంస్థలు ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి. ఏఐజీ వాటా గరిష్ఠంగా 45 శాతం. మిగతా ఇన్సూరర్లలో న్యూ ఇండియా, ఓరియంటల్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ లాంబార్డ్, యునైటెడ్, నేషనల్ ఉన్నాయి.
ఆదుకుంటున్న రీఇన్సూరెన్స్
క్లెయిముల భారం నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలను రీఇన్సూరెన్స్ సంస్థలే ఆదుకుంటున్నాయిప్పుడు. 242 మంది విమాన ప్రయాణీకులకు బీమా భరోసా కోసం ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలు రీఇన్సూరెన్స్ చేశాయి. లండన్ మార్కెట్లోని ఏవోఎన్, విల్లీస్ ఇన్సూరెన్స్ సంస్థలకు రీఇన్సూరెన్స్ కోసం ఇన్సూరెన్స్ సంస్థలు సొమ్ము చెల్లించాయి. దీంతో ప్రాణ, ఆస్తి నష్టాలకు, థర్డ్ పార్టీలకు క్లెయిముల బాధ్యత ఏవోఎన్, విల్లీస్లదే అవుతున్నది. కాగా, ఈ ప్రమాదం నేపథ్యంలో మృతులకు ఒక్కొక్కరికీ రూ.1.8 కోట్లు రావచ్చని చెప్తున్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ.18 లక్షలు రావ చ్చు. విమాన ప్రమాదంలో బీమా సాయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీఐపీలు, ఆయా దేశస్తులు, తలసరి ఆదాయం, హోదా, జీతాలు ప్రభావితం చేస్తాయి.