Infosys | ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు రెండేండ్ల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి. 2022-23 మార్చి త్రైమాసికం ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను మిస్ కావడంతో సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే ఇన్ఫీ షేర్ దాదాపు 15 శాతం నష్టపోయింది. 2019 అక్టోబర్ తర్వాత ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్ స్టాక్ భారీగా నష్టపోవడం ఇదే తొలిసారి. నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ 7.6 శాతం పతనమైంది. తిరిగి ట్రేడింగ్ ముగిసే సమయానికి ఇన్ఫోసిస్ తిరిగి కోలుకుని తొమ్మిది శాతం నష్టంతో సరిపెట్టుకున్నది. తద్వారా ఇన్ఫీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.59,349 కోట్లు కోల్పోయింది.
అమెరికాతోపాటు ఈయూ బ్యాంక్‌ల్లో ఆర్థిక సంక్షోభంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెవెన్యూ గైడెన్స్ బలహీనంగా 4-7 శాతమే ఉంటుందని ఇన్ఫీ అంచనా వేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బ తిన్నది. మార్కెట్ విశ్లేషకులు 10.7 శాతం గ్రోత్ ఉంటుందని అంచనా వేశారు. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ రూ.6128 కోట్ల నికర లాభం గడించింది. మార్కెట్ విశ్లేషకులు రూ.6624 కోట్ల నికర లాభం గడిస్తుందని అంచనా వేశారు. ఆర్థిక మాంద్యం భయాలతో బ్యాంకింగ్, ఫైనాన్సియల్, ఇన్సూరెన్స్ సహా దాదాపు అన్ని రంగాల క్లయింట్లు పొదుపు చర్యలు పాటిస్తున్నాయి. గతంలో 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ అతి తక్కువగా 5.8 శాతం గ్రోత్‌రేట్ నమోదైంది.
ఫలితంగా బీఎస్ఈలో ఇన్ఫోసిస్ స్టాక్ 12.21 శాతం నష్టంతో రూ.1219 వద్ద 52 వారాల గరిష్టంతో ట్రేడయింది. ఎన్ఎస్ఈలో 14.67 శాతం (52 వారాల కనిష్టం) పతనమై రూ.1,185.30 వద్ద ట్రేడయింది. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీల్లో భారీగా పతనమైన స్టాక్‌గా ఇన్ఫోసిస్ నిలిచింది.
బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ ఉదయం 891.04 పాయింట్లు (1.47 శాతం) నష్టంతో 59,539.96 పాయింట్ల వద్ద బలహీనంగా ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇన్ఫోసిస్‌తోపాటు ఇతర ఐటీ స్టాక్స్ భారీ నష్టపోయాయి. అలా నష్టపోయిన వాటిలో టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో స్టాక్స్ 3-6 శాతం మధ్య పతనం అయ్యాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ సహా ఐటీ సంస్థలకు వచ్చే రెవెన్యూలో 25 శాతానికి పైగా అమెరికా, ఈయూ బ్యాంకింగ్, ఫైనాన్సియల్, బీమా సెక్టార్ల నుంచే కావడం గమనార్హం. గత నెలలో అమెరికాలో రెండు మధ్య శ్రేణి బ్యాంకులు సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.