Infosys | దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ స్క్రిప్ట్ భారీ కోతకు గురైంది. సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఇన్ఫీ షేర్ తొమ్మిది శాతం నష్టపోయి రూ.1,592కి పడిపోయింది. గత రెండేండ్లలో ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఇన్ఫీ స్క్రిప్ట్ ఇంత భారీగా పతనం కావడం ఇదే తొలిసారి. 2020 మార్చి 23న ఇన్ఫీ షేర్ 12 శాతం నష్టపోయింది.
గత ఆర్థిక సంవత్సరం అంచనాలకంటే తక్కువగా సంస్థ నికర లాభాలు నమోదయ్యాయి. గత నెలతో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫీ నికర లాభాలు అంచనాల కంటే తక్కువగా నమోదు కావడంతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీనపడింది.
లోయర్ యుటిలైజేషన్, అధిక వీసా ఖర్చుల వల్ల నికర లాభం 190 బేసిక్ పాయింట్లు (21.6 శాతం) తగ్గింది. డాలర్ల రూపేణా ఇన్ఫీ ఆదాయం 0.7 శాతం వృద్ధితో 4,280 మిలియన్ డాలర్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇన్ఫోసిస్ 21-23 శాతం లాభాలు గడిస్తుందని అంచనా వేసినట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం గైడెన్స్‌తో పోలిస్తే ఇది 100 బేసిక్ పాయింట్లు తక్కువ. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ గ్రోత్ 13-15 శాతం ఉంటుందని పేర్కొంది.