న్యూఢిల్లీ, అక్టోబర్ 17 : దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవలం సంస్థ ఇన్ఫోసిస్ విశ్లేషకుల అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను(జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో) రూ.6,506 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6,212 కోట్ల లాభంతో పోలిస్తే 4.7 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. తొలి త్రైమాసికపు లాభంతో పోలిస్తే 2.2 శాతం పెరుగుదల కనిపించింది. సమీక్షకాలంలో కంపెనీ రూ.40,986 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఏడాది ప్రాతిపదికన ఆదాయంలో 4.2 శాతం వృద్ధి నమోదైంది.
ఆదాయ అంచనాలో వృద్ధిని మరోసారి పెంచింది ఇన్ఫోసిస్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి తొలి త్రైమాసికంలో 3-4 శాతం మధ్యలో ఆదాయ వృద్ధి ఉంటుందని అంచనావేసిన సంస్థ..రెండో త్రైమాసికంలో దీనిని 3.75 శాతం నుంచి 4.50 శాతం మధ్యలో ఉంటుందని పేర్కొంది. జూన్ త్రైమాసికంలో 1-3 శాతం మధ్యలో ఉంటుందని గతంలో అంచనావేసింది. అతిపెద్ద ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్లనే ఆదాయ అంచనాలను సవరిస్తున్నది సంస్థ. మరోవైపు, గత ఆరు త్రైమాసికాలుగా తగ్గుతూ వచ్చిన ఉద్యోగులు గత త్రైమాసికంలో పెరిగారు. సెప్టెంబర్ చివరినాటికి 2,500 మంది సిబ్బంది చేరడంతో మొత్తం 3,17,240కి చేరుకున్నారు. అలాగే ఉద్యోగుల వలసలు మాత్రం స్వల్పం గా పెరిగి 12.9 శాతానికి చేరుకున్నాయి.
రెండో త్రైమాసికంలో ఆశాజనక పనితీరు కనబరిచాం. ఆర్థిక సేవల రంగానికి డిమాండ్ అధికంగా ఉండటంతో కరెన్సీ రూపంలో 3.1 శాతం వృద్ధిని సాధించాం. గత త్రైమాసికంలో 2.4 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది.
– సలీల్ పరేఖ్, ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ