న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ‘ప్రపంచంలో ఉత్తమమైన కంపెనీలు 2023’ టాప్ 100 జాబితాలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ స్థానం సంపాదించింది. టైమ్ పత్రిక రూపాందించిన ఈ జాబితాలో చోటుచేసుకున్న భారతీయ కంపెనీ ఇదొక్కటే కావడం గమనార్హం. ఈ ఐటీ సర్వీసుల కంపెనీ 64వ స్థానంలో ఉంది. అలాగే ప్రొఫషనల్ సర్వీసులు అందిస్తున్న టాప్-3 కంపెనీల్లో ఒకటిగా టైమ్స్ ఎంపికచేసింది.
ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, మైక్రోసాఫ్ట్, తదుపరి మూడు స్థానాలను యాపిల్, ఆల్ఫాబెట్ (గూగుల్ మాతృసంస్థ), మెటా ప్లాట్‌ఫామ్స్ సాధించాయి. టాప్-100 జాబితాలో యాక్సెంచర్, ఫైజర్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, బీఎండబ్ల్యూ, డెల్ టెక్నాలజీస్, లూయిస్ వ్యుటన్, డెల్టా ఎయిర్‌లైన్స్, స్టార్‌బక్స్, ఫోక్స్‌వ్యాగన్, జనరల్ మోటార్స్, ఫోర్డ్ తదితర కంపెనీలు ఉన్నాయి.
ఆదాయ వృద్ధి, సంతృప్తికర ఉద్యోగి సర్వేలు, ఎన్విరాన్మెంటల్, సోషల్, కార్పొరేట్ గవర్నెన్స్ (ఈఎస్జీ) పాటింపు ఫార్ములా ఆధారంగా జాబితాను రూపొందించారు. ఇన్వెస్టర్లు, ఉద్యోగులు, ధరణికి ప్రపంచంలో అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు మంచి చేస్తున్నాయని టైమ్ పేర్కొంది. ఉదాహరణకు జాబితాలో అగ్రస్థానాన్ని పొందిన మైక్రోసాఫ్ట్ ఇటీవలి ఆర్థిక సంవత్సరంలో 72 బిలియన్ డాలర్లు ఆర్జించిందని, 2020తో పోలిస్తే 63 శాతం వృద్ధి సాధించిందని, 0.5 శాతం ఉద్గారాలను తగ్గించిందని టైమ్ వివరించింది. భారత్‌లో అధిక శాతం ఉద్యోగులతో ఐటీ కేంద్రాలను నడుపుతున్న నెదర్లాండ్స్ కంపెనీ యాక్సెంచర్ ఈఎస్జీ ర్యాంకింగ్‌లో ప్రథమస్థానంలో ఉంది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ఇప్పటికే రికార్డు స్థాయికి పడిపోయి తిరిగి కోలుకున్న రూపాయి మారకం విలువ మళ్లీ పతనాన్ని నమోదు చేసుకున్నది. డాలర్‌తో పోలిస్తే 13 పైసలు కోల్పోయి 83.16కి జారుకున్నది. క్రూడాయిల్ ధరలు భగ్గుమనడంతో మారకం పతనాన్ని శాసించింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా పుంజుకున్నప్పటికీ రూపాయి విలువ పడిపోవడం విశేషం. ఫారెక్స్ మార్కెట్లో 83.02 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ ఎక్సేంజ్ రేటు 82.98 నుంచి 83.20 స్థాయిలో కదలాడింది. చివరకు 13 పైసలు కోల్పోయి 83.16 వద్ద ముగిసింది. గురువారం కూడా రుపీ విలువ 2 పైసలు కోల్పోయిన విషయం తెలిసిందే.