న్యూఢిల్లీ, మార్చి 30 : గత కొన్ని నెలలుగా పడకేసిన పారిశ్రామిక రంగం మళ్లీ పుంజుకున్నది. తయారీ రంగం అంచనాలకుమించి రాణించడంతో గత నెలకుగాను పారిశ్రామిక రంగం 5.2 శాతం వృద్ధిని సాధించింది. ఈ విషయాన్ని సోమవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 2.7 శాతంతో పోలిస్తే రెండింతలు పెరిగినట్టు కేంద్ర గణాంకాల శాఖ పేర్కొంది.
అలాగే జనవరి నెలకుగాను పారిశ్రామిక వృద్ధిని 4.8 శాతం నుంచి 5.1 శాతానికి సవరించింది. గత నెలలో తయారీ రంగం అత్యధికంగా 6 శాతం నమోదు చేసుకోవడం వల్లనే ఐఐపీ భారీగా పెరిగిందని వెల్లడించింది. అలాగే గనులు 1.6 శాతం నుంచి 3.1 శాతానికి పెరుగగా, పవర్ జనరేషన్ మాత్రం 2.3 శాతానికి పడిపోయింది.