న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: పారిశ్రామిక రంగం నెమ్మదించింది. గనులు, తయారీ రంగాలు నిరాశాజనక పనితీరు కనబర్చడంతో డిసెంబర్ నెలకుగాను మూడు నెలల కనిష్ఠాన్ని తాకుతూ 3.2 శాతానికి పడిపోయిందని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్, ఆగస్టు నెలలో ఇంతే స్థాయిలో పారిశ్రామిక ప్రగతి నమోదైంది. 2023 డిసెంబర్ నెలలో నమోదైన 4.4 శాతంతో పోలిస్తే భారీగా పడిపోయింది. డిసెంబర్ నెలలో తయారీ రంగం 3 శాతం వృద్ధిని కనబరచగా, క్రితం ఏడాది నమోదైన 4.6 శాతంతో పోలిస్తే భారీగా తగ్గింది.
అలాగే గనుల్లో ఉత్పత్తి 5.2 శాతం నుంచి 2.6 శాతానికి పడిపోవడం వల్లనే పారిశ్రామిక రంగం పడకేసింది. కానీ, విద్యుత్ ఉత్పత్తి మాత్రం 1.2 శాతం నుంచి 6.2 శాతానికి ఎగిసింది. మరోవైపు, నవంబర్ నెల గణాంకాలను కేంద్ర సర్కార్ మార్చివేసింది. గతంలో 5.2 శాతంగా ఉన్నదని వెల్లడించిన గణాంకాలను ఈసారి దీనిని 5 శాతానికి కుదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో పారిశ్రామిక రంగం 4 శాతం వృద్ధిని నమోదుచేసుకున్నది. అంతక్రితం ఏడాది నమోదైన 6.3 శాతంతో పోలిస్తే మందగించింది. క్యాపిటల్ గూడ్స్ 10.3 శాతం వృద్దిని కనబరచగా, కన్జ్యూమర్ డ్యూరబుల్ 8.3 శాతం, మౌలిక సదుపాయాలు/నిర్మాణ రంగ గూడ్స్ 6.3 శాతం, ప్రాథమిక వస్తువులు 3.8 శాతం, ఇంటర్మీడియట్ గూడ్స్ 5.9 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేసుకున్నాయి.
గత కొన్ని నెలలుగా దూసుకుపోతున్న ధరల సూచీ కాస్త శాంతించింది. జనవరి నెలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్ఠాన్ని తాకుతూ 4.31 శాతంగా నమోదైంది. కూరగాయలు, కోడిగుడ్లు, పప్పుదినుసుల ధరలు తగ్గుముఖం పట్టడం వల్లనే ధరల సూచీ తగ్గిందని పేర్కొంది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో ధరల సూచీ 5.1శాతంగాను, అలాగే డిసెంబర్ నెలలో నమోదైన 5.22 శాతం కంటే తగ్గుముఖం పట్టింది. బంగాళాదుంప, కొబ్బరి, వెల్లుల్లి, బఠానీ ధరలు భారీగా తగ్గడం ధరల సూచీ తగ్గడానికి ప్రధాన కారణమని విశ్లేషించింది. మరోవైపు, జీరా, అల్లం, ఎండుమిర్చి, బెండకాయ, వంటగ్యాస్ ధరలు ఏడాది కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.