Indusind | వరుసగా ఐదోరోజు ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు భారీగా పడిపోయాయి. ఉదయం ట్రేడింగ్‌లో బ్యాంక్ షేర్లు 25శాతం తగ్గాయి. ప్రైవేటురంగ బ్యాంక్ డెరివేటివ్ పోర్ట్‌ఫోలియోలో అవకతవకలను గుర్తించిన నేపథ్యంలో షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. మంగళవారం ఉదయం ఇండస్ఇండ్ షేర్లు మధ్యాహ్నం 1.45 గంటలకు రూ.226.90 తగ్గి ఒక్కో షేరు ధర రూ.673.60 చేరి.. 52 వారాల కనిష్ఠానికి చేరుకుంది. అదే సమయంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో కంపెనీ షేరు రూ.227.70 తగ్గి.. ఒక్కో షేరుకు రూ.673కి చేరింది. సోమవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో డెరివేటివ్ పోర్ట్‌ఫోలియోకు సంబంధించిన ప్రక్రియల అంతర్గత సమీక్ష సందర్భంగా ఖాతాల బ్యాలెన్స్‌లో కొన్ని వ్యత్యాసాలను గుర్తించినట్లు ఇండస్ఇండ్ బ్యాంక్ పేర్కొంది.
ముంబయికి చెందిన ఇండస్ఇండ్ బ్యాంక్ డెరివేటివ్ పోర్ట్‌ఫోలియోలో అవకతవకలను గుర్తించామని అంతర్గత సమీక్షలో పేర్కొంది. దాంతో బ్యాంక్ నికర విలువపై దాదాపు 2.35 శాతం ప్రతికూల ప్రభావం పడనున్నట్లు అంచనా వేసింది. ఇది రూ.1,530 కోట్ల నష్టానికి సమానం అన్నమాట. బ్యాంక్ ప్రకటన షేర్లపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే షేర్లు 25శాతం వరకు పతనమయ్యాయి. ఫలితంగా బ్యాంక్ మార్కెట్ విలువ ఏకంగా రూ.14వేల కోట్లు తగ్గింది. గతేడాది డిసెంబర్ నాటికి బ్యాంక్ నికర విలువ రూ.65,102 కోట్లుగా ఉన్నది. సెప్టెంబర్ 2023లో ఆర్బీఐ జారీ చేసిన సూచనల మేరకు ఈ సమీక్ష జరిగింది. ఈ విషయాన్ని ఆడిటర్ పరిశలిస్తుందని.. మార్చి 2025 నాటికి నివేదిక వస్తుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. అయితే, ప్రతికూల ప్రభావాన్ని తట్టుకోగలమని బ్యాంక్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు సోమవారం దాదాపు నాలుగుశాతం పడిపోయాయి.