న్యూఢిల్లీ, మార్చి 11: దేశంలోని టాప్-5 ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఇండస్ఇండ్ బ్యాంక్ లెక్కల్లో ఏకంగా రూ.2,100 కోట్ల తేడా బయటపడింది. గత ఏడాది డిసెంబర్ నాటికున్న బ్యాంక్ నికర విలువలో ఇది దాదాపు 2.35 శాతానికి సమానం కావడం గమనార్హం. కాగా, డెరివేటివ్ పోర్ట్‌ఫోలియోలో ఈ వ్యత్యాసాన్ని బ్యాంక్ గుర్తించింది. నిరుడు సెప్టెంబర్, అక్టోబర్ అకౌంటింగ్లో తప్పుల్ని కనుగొన్నామని, గత వారమే ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు ప్రాథమికంగా తెలియపర్చామని బ్యాంక్ సీఈవో, ఎండీ సుమంత్ కత్పాలియా తాజాగా తెలిపారు. అయితే బ్యాంక్ లాభాలు, మూలధనం దృష్ట్యా సదరు రూ.2,100 కోట్లను సర్దుబాటు చేసుకునే సామర్థ్యం తమకున్నదని చెప్పినా.. స్టాక్ మార్కెట్లలో మదుపరుల భయాలను అడ్డుకోలేకపోయారు.
మంగళవారం ట్రేడింగ్‌లో అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ)ల్లో 27 శాతానికిపైగా ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ విలువ దిగజారింది. బీఎస్ఈలో 27.17 శాతం కోల్పోయి రూ.655.95 వద్ద ముగియగా, ఒకానొక దశలో 52 వారాల కనిష్ఠాన్ని తాకుతూ రూ.649కి పతనమైంది. ఎన్ఎస్ఈలోనూ 27.06 శాతం నష్టపోయి రూ.656.80 వద్ద నిలిచింది. నిజానికి సోమవారమే ఈ సమాచారం స్టాక్ ఎక్సేంజీలకు తెలియపర్చగా.. లెక్కల్లో అసలు తేడా ఎంతన్నది వచ్చే నెల్లోగానీ తెలియకుండా ఉన్నది. ఓ బయటి ఏజెన్సీతో బ్యాంక్ విచారణ జరిపిస్తున్నది. ఆ నివేదిక వస్తేగానీ అకౌంటింగ్లో కచ్ఛితమైన వ్యత్యాసం వెలుగుచూడదు.
గడిచిన ఫారెక్స్ లావాదేవీలకు సంబంధించి హెడ్జింగ్ ఖర్చుల్ని బ్యాంక్ తక్కువగా అంచనా వేసినట్టు ఓ అంతర్గత సమీక్షలో తేలింది. దీనివల్ల రూ.2,100 కోట్ల వరకు లెక్కల్లో వ్యత్యాసం వచ్చింది. దీన్ని చక్కదిద్దేంత మూలధనం ఉందని చెప్పినా ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు తెగబడ్డారు. బ్యాంకులో పాలనాపరమైన లోపాలున్నాయన్న ఆందోళనలు మదుపరుల్లో నెలకొన్నాయి. గత వారం బ్యాంక్ సీఈవో, ఎండీ కత్పాలియా పదవీకాలాన్ని మూడేండ్లకు పెంచుతూ ఇండస్ఇండ్ బ్యాంక్ బోర్డు ప్రతిపాదించినా, ఆర్బీఐ మాత్రం ఏడాదికే అనుమతిచ్చింది. దీంతో సోమవారం బ్యాంక్ షేర్ 4 శాతం వరకు నష్టపోయింది. ఈ క్రమంలో మంగళవారం ఏడాది కనిష్ఠానికి క్షీణించింది.