UHNWI | 2021తో పోలిస్తే భారత్‌లో 2022లో అత్యంత సంపన్నులు 7.5 శాతం తగ్గారు. వచ్చే ఐదేండ్లలో.. అంటే 2027 నాటికి 58.4 శాతానికి పెరుగుతుందని.. నైట్‌ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్’ వెల్లడించింది. నికర ఆస్తి సుమారు రూ.227 కోట్ల (30 మిలియన్ డాలర్లు) కంటే ఎక్కువ గల వారిని అత్యంత సంపన్నులు (Ultra High Networth Individuals-UHNWI) గా పరిగణిస్తున్నామని తెలిపింది. కానీ, 2021లో 145 మంది బిలియనీర్లు ఉంటే.. 2022లో 161 మందికి చేరారు. 2027 కల్లా 195 మంది అత్యంత సంపన్నులుగా అవతరిస్తారని నైట్ ఫ్రాంక్ పేర్కొన్నది.
గతేడాది అత్యంత సంపన్నులు 12,069 మంది కాగా, 2027కల్లా 19,119 మంది ఆ జాబితాలో చేరతారని తెలిపింది. పది లక్షల డాలర్ల కంటే ఎక్కువ సంపద గల ధనికులు 2021 నుంచి 2022 కల్లా 7,63,674 నుంచి 7,97,714 మందికి పెరిగారు. వచ్చే ఐదేండ్లలో ధనికుల సంఖ్య 16,57,272కు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు నైట్ ఫ్రాంక్ పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా 2021తో పోలిస్తే 2022లో అత్యంత ధనికుల సంఖ్య 3.8 శాతం తగ్గిందని నైట్ ఫ్రాంక్ వివరించింది. 2021లో అత్యంత సంపన్నుల సంఖ్య 9.3 శాతం పెరిగింది. ధరల నియంత్రణకు వడ్డీరేట్లు.. దాని కొనసాగింపుగా ఆర్థిక మందగమనం, ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో ధనికుల పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడిందని, భారత్ లోనూ ఇదే పరిస్థితి నెలకొందని తెలిపింది. యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచడంతో డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనం కూడా ఇండియాలో సంపన్నుల పెట్టుబడులపై ప్రభావం చూపిందని వివరించింది. 2021తో పోలిస్తే భారత్‌లో ధనికులు సంఖ్యాపరంగా 2022లో 4.5 శాతం వృద్ధి చెందారు. బిలియనీర్ల సంఖ్య కూడా 11 శాతం పెరిగింది.
‘కీలకం, ఇతర రంగాల్లో జోరుగా సాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో ఆర్థికంగా వృద్ధి వేగవంతం అవుతుంది. స్టార్టప్ సంస్థలకు భారత్ కేంద్రంగా ఉండటం వల్ల కూడా సంపద సృష్టికి కారణం. మేడిన్ ఇండియా, మౌలిక వసతుల ప్రగతి, టెక్ స్టార్టప్ ల నుంచి వస్తున్న అవకాశాలు సంపద మరింత సృష్టించడానికి బాటలు పడుతున్నాయి. అందువల్లే భారతదేశంలో ధనవంతులు పెరుగుతున్నారు’ అని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ శిశిర్ బైజాల్ చెప్పారు.