న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: భారతీయ సేవల రంగం వృద్ధిరేటు వరుసగా రెండో నెలా పడిపోయింది. గత నెల మార్చిలో 14 నెలల కనిష్ఠాన్ని తాకుతూ 57.5కు పరిమితమైంది. గత ఏడాది జనవరి తర్వాత ఈ స్థాయికి పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) రావడం ఇదే తొలిసారి. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 58.1గా ఉన్నట్టు హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ సోమవారం తమ నెలవారీ సర్వేలో వెల్లడించింది. దీంతో కొత్త వ్యాపారాల్లో మందగమనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని పేర్కొన్నది.
2022 జూన్ నుంచి ఉత్పాదక వ్యయాలు బాగా పెరిగిపోతున్నాయని, ఈ క్రమంలోనే తాజాగా 7 నెలల గరిష్ఠానికి విక్రయ సమయంలో విలువ ఆధారిత ద్రవ్యోల్బణం చేరిందని వివరించింది. ఫిబ్రవరి నుంచి చికెన్, వంటనూనె, గుడ్లు, విద్యుత్తు, చేపలు, పండ్లు, ఇంధనం, కార్మిక వ్యయం, మాంసం, కూరగాయల ధరలు పెరుగుతున్నట్టు చెప్తున్నారు. ఉత్పాదక వ్యయ ద్రవ్యోల్బణం 2022 నుంచి వేగంగా పెరిగిపోతున్నదని, అధిక ఇంధన ధరలు, రవాణా-లాజిస్టిక్స్ ఖర్చుల్ని ఇది ప్రతిబింబిస్తున్నదని ఈ సందర్భంగా హెచ్ఎస్బీసీ ఇండియా ప్రధాన ఆర్థికవేత్త ప్రంజుల్ భండారీ అన్నారు.
కన్జ్యూమర్ సర్వీసెస్, ఆర్థిక, బీమా రంగాల్లో ఇన్పుట్ కాస్ట్స్, ఔట్పుట్ చార్జీలు భారీగా పెరిగిపోతున్నట్టు గుర్తించామని హెచ్ఎస్బీసీ సర్వే చెప్తున్నది. కాగా, హెచ్ఎస్బీసీ ఇండియా కంపోజిట్ పీఎంఐ ఔట్పుట్ ఇండెక్స్ ఫిబ్రవరిలో 58.9 నుంచి 57కు దిగజారింది. ఇది దాదాపు మూడున్నరేండ్లలో అత్యంత కనిష్ఠం కావడం గమనార్హం. సుమారు 400 సేవా రంగ కంపెనీల ప్యానెల్‌కు వివిధ రకాల ప్రశ్నలు సంధించి వాటికి వచ్చిన సమాధానాల ఆధారంగా హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ గణాంకాలను ఎస్అండ్పీ గ్లోబల్ రూపొందిస్తుంది.