Retail Inflation | జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగింది. గత మే నెలలో 25 నెలల కనిష్ట స్థాయి 4.25 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కాగా, జూన్లో 4.81 శాతానికి దూసుకెళ్లింది. అయినా.. వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం.. ఆర్బీఐ నియంత్రిత స్థాయి 2-6 శాతం లోపే నమోదైంది. ఇలా రిటైల్ ద్రవ్యోల్బణం ఆరు శాతానికి తక్కువగా నమోదు కావడం వరుసగా నాలుగో నెల. కొన్ని వారాలుగా కూరగాయలు ప్రత్యేకించి టమోటాల ధరలు ఊహించిన దానికంటే ఎక్కువగా పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణానికి రెక్కలొచ్చాయి.
టమోటాలు, ఇతర కూరగాయల ధరలు పెరిగిపోవడంతో జూన్ రిటైల్ ద్రవ్యోల్బణం 4.8 శాతాన్ని దాటుతుందని అంచనా వేశారు. జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం 4.7 శాతం ఉంటుందని ఇక్రా అంచనా వేసింది. అయితే మే నెలలో 2.91 శాతంగా ఉన్న వినియోగదారుల ఆహార ధరల సూచీ (సీఎఫ్పీఐ).. జూన్ నాటికి 4.49 శాతానికి పెరిగింది. గ్రామీణ ద్రవ్యోల్బణం 4.72 శాతం కాగా, పట్టణ ద్రవ్యోల్బణం 4.96 శాతానికి దూసుకెళ్లింది. ఫుడ్ అండ్ బేవరెజెస్ ద్రవ్యోల్బణం 4.63 శాతం, ఇంధన ద్రవ్యోల్బణం 3.92 శాతం, తృణధాన్యాల ద్రవ్యోల్బణం 12.65 నుంచి 12.71 శాతానికి పెరిగింది.