HDFC AMC Prasant Jain | దేశంలోనే అతిపెద్ద ఈక్విటీ ఫండ్ సంస్థ హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ప్రశాంత్ జైన్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈక్విటీ ఫండ్ మేనేజ్మెంట్లో ఆయన చాలా సీనియర్. భారత మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు పునాదులేసిన వారిలో ప్రశాంత్ జైన్ ఒకరు. హెచ్డీఎఫ్సీ ఏఎంసీలో రూ.4.21 లక్షల కోట్ల విలువైన ఈక్విటీ ఫండ్లు నిర్వహిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్ మేనేజర్‌గా 28 ఏండ్ల పాటు కొనసాగిన ఏకైక వ్యక్తిగా నిలిచారు.
ఐఐటీ కాన్ఫూర్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ అందుకున్న ప్రశాంత్ జైన్.. ఐఐఎం-బెంగళూరులో ఎంబీఏ పూర్తి చేశారు. ఎస్బీఐ క్యాప్స్‌లో కెరీర్ ప్రారంభించారు. అక్కడ నుంచి 20థ్ సెంచరీ మ్యూచువల్ ఫండ్‌కు మారారు. 1998లో సెంచరీ మ్యూచువల్ఫండ్ను జ్యురిష్ మ్యూచువల్ ఫండ్ టేకోవర్ చేసింది. 2003లో జ్యురిష్ మ్యూచువల్ ఫండ్‌ను హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ కైవసం చేసుకున్నది. నాటి నుంచి ప్రశాంత్ జైన్..హెచ్‌డీఎఫ్‌సీలోనే కొనసాగారు.
హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్స్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌ను ప్రశాంత్ జైన్ నిర్వహించారు. దీని కార్పస్‌ఫండ్ విలువ రూ.43 వేల కోట్ల పై మాటే. ఈ పథకంలో చేరిన వారికి 1994 నుంచి నుంచి ఏటా 17.87 శాతం రిటర్న్స్ లభిస్తున్నాయి. ప్రశాంత్ జైన్ నిర్వహిస్తున్న స్కీమ్‌ల్లో హెచ్డీఎఫ్సీ టాప్-100, హెచ్డీఎఫ్సీ ఫ్లెక్సీ-క్యాప్ వంటి పథకాలు ఏటా 18 శాతం రిటర్న్స్ ఇస్తున్నాయి.
ప్రశాంత్ జైన్ రాజీనామాను హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఆమోదించింది. హెచ్డీఎఫ్సీ ఏఎంసీలో 19 ఏండ్లు కొనసాగిన ప్రశాంత్ జైన్ స్థానంలో చిరాగ్ సెతల్వాద్‌ను ఈక్విటీ అధిపతిగా, శోభిత్ మెహ్రోత్రాను ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగం చీఫ్‌గా నియమిస్తున్నట్లు బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది. సెతల్వాద్, మెహ్రోత్రాలు నేరుగా హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఎండీ కం సీఈవో నవ్‌నీత్ మునోత్కు రిపోర్ట్ చేస్తారని పేర్కొంది.