Gold Imports | బంగారం అంటే భారతీయులకు.. అందునా మహిళలకు మక్కువ. ప్రతి పండక్కి, పెండ్లిండ్లకు పిసరంతైనా బంగారం కొనుగోలు చేస్తుంటారు. వెసులుబాటు లేకపోతే ఉన్న ఆభరణాలైనా ధరిస్తుంటారు. కానీ, ఇటీవలి కాలంలో బంగారం ధరలు కొండెక్కుతున్నాయి. దీంతో బంగారం పట్ల భారతీయుల్లో మక్కువ తగ్గుతున్నట్లు కనిపిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బంగారం దిగుమతులు ఐదు శాతం తగ్గి 149.7 టన్నులకు పడిపోయాయి. గతేడాది ఇదే టైంలో 158.1 టన్నుల బంగారం దిగుమతైందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) తెలిపింది. కానీ, విలువ రూపేణా గతేడాది దిగుమతి చేసుకున్న బంగారం విలువ రూ.82,530 కోట్లు కాగా, ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో దిగుమతి చేసుకున్న బంగారం విలువ రూ.93,850 కోట్లు. అంటే 14 శాతం పెరిగిందన్న మాట.
‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో బంగారం డిమాండ్ స్వల్పంగా తగ్గింది. రికార్డు స్థాయిలో పెరిగిపోయిన ధరలతో వినియోగదారుల నుంచి గిరాకీ తగ్గింది. అయినప్పటికీ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దిగుమతి చేసుకున్న బంగారం విలువ 14 శాతం పెరిగింది’ అని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ఇండియా రీజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సచిన్ జైన్ పేర్కొన్నారు.
2023-24తో పోలిస్తే గత జూన్ త్రైమాసికంలో బంగారం ధరలు 18 శాతం పెరిగాయి. రికార్డు స్థాయిలో ఔన్స్ బంగారం ధర 2338.2 డాలర్ల నుంచి 2427 డాలర్లకు పెరిగింది. డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 13 శాతం వృద్ధి నమోదైంది. అధిక ధరలు, సార్వత్రిక ఎన్నికలు, హీట్ వేవ్ కారణంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బంగారం ఆభరణాలకు డిమాండ్ 17 శాతం తగ్గి 107 టన్నులకు చేరుకున్నది. కరోనా మహమ్మారి తర్వాత ఒక త్రైమాసికంలో బంగారం కొనుగోళ్లు బలహీన పడటం ఇది రెండోసారి అని డబ్ల్యూజీసీ తెలిపింది.