2011-12 ధరల వద్ద అక్టోబర్-డిసెంబర్లో దేశ జీడీపీ విలువ రూ.40.19 లక్షల కోట్లు
2011-12 ధరల వద్ద 2022-23 జీడీపీ విలువ రూ.159.71 లక్షల కోట్లుగా ఉండొచ్చని అంచనా
ప్రస్తుత ధరల ప్రకారం అక్టోబర్-డిసెంబర్లో దేశ జీడీపీ విలువ రూ.69.38 లక్షల కోట్లు
వృద్ధికి ఊపిరిలూదే ఉత్పాదక రంగమే ఉసూరుమంటున్నది.
దేశీయ తయారీ కార్యకలాపాల్లో స్తబ్ధత.. జీడీపీ పరుగులకు బ్రేకులు వేసింది మరి.
అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారత వృద్ధిరేటు 4.4 శాతంగానే నమోదైంది. అంతకుముందుతో పోల్చితే భారీగా పతనమైంది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: నీరసించిన ఉత్పాదక రంగం.. వృద్ధిరేటు ఉత్సాహాన్ని ఆవిరి చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం (క్యూ3)లో దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 4.4 శాతంగానే నమోదైంది. ఈ మేరకు మంగళవారం జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) ప్రకటించింది. అయితే అంతకుముందు జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ2)లో 6.3 శాతంగా ఉండటం గమనార్హం. ఇక గత ఆర్థిక సంవత్సరం (2021-22) మూడో త్రైమాసికంలో 11.2 శాతంగా ఉండగా, ఏ రకంగా చూసినా తాజా గణాంకాలు దేశంలో ఆర్థిక పరిస్థితులు దిగజారాయనే స్పష్టం చేస్తున్నాయి. వరుసగా రెండు త్రైమాసికాల్లో పడిపోయిన వృద్ధిరేటే ఇందుకు నిదర్శనం.
కదలని తయారీ రంగం
ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే లక్ష్యం గా రిజర్వ్ బ్యాంక్ తమ ద్రవ్యసమీక్షల్లో కీలక వడ్డీరేట్లను పెంచుకుంటూపోవడం.. దేశ తయారీ రంగాన్ని పెద్ద ఎత్తునే ప్రభావితం చేసింది. బలహీనపడ్డ ఉత్పాదక రంగ కార్యకలాపాలు.. మొత్తం జీడీపీనే ప్రభావితం చేశాయిప్పుడు. క్యూ3లో కీలకమైన ఉత్పాదక రంగం ప్రతికూల స్థితికి చేరగా, మైనస్ 1.1 శాతానికి దిగజారింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో 1.3 శాతం వృద్ధిని కనబర్చడం గమనార్హం. కన్జ్యూమర్ డిమాండ్, ఎగుమతుల్లో క్షీణత, వృద్ధిరేటును మందగమనంలోకి నెట్టిందని మెజారిటీ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వృద్ధికి దెబ్బేనన్నారు.
మొత్తం ఏడాది 7 శాతం?
ఈ ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ 7 శాతంగా నమోదు కావచ్చని ఈ సందర్భంగా ఎన్ఎస్వో గణాంకాల్లో కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఆర్బీఐ తమ చివరి ద్రవ్యసమీక్షలో 6.8 శాతంగా అంచనా వేసిన విషయం తెలిసిందే. అలాగే క్యూ3 జీడీపీని 4.4 శాతంగా, క్యూ4 (జనవరి-మార్చి తైమాసికం)లో 4.2 శాతంగా పేర్కొన్నది. మరోవైపు గత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి గణాంకాలను సవరించారు. 8.7 శాతం నుంచి 9.1 శాతానికి పెంచారు. ఇదిలావుంటే ప్రజా పరిపాలన, రక్షణ, ఇతర సేవా రంగాల్లో వృద్ధి 2 శాతానికే పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇది 10.6 శాతంగా ఉన్నది. కాగా, తలసరి ఆదాయం 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రస్తుత ధరల ప్రకారం రూ.1,96,716గా అంచనా వేశారు.
67.8 శాతానికి ద్రవ్యలోటు
తగ్గిన కేంద్ర ప్రభుత్వ ఆదాయం, పెరిగిన ఖర్చులు
తగ్గిన ఆదాయం, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు పూర్తి ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) లక్ష్యంలో జనవరి ఆఖరు నాటికి 67.8 శాతాన్ని తాకింది. ఈ మేరకు మంగళవారం విడుదలైన అధికారిక గణాంకాల్లో తేలింది. నగదు రూపంలో చూస్తే.. రూ.11.9 లక్షల కోట్లుగా ఉన్నట్టు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) డాటా తెలిపింది. ఇక బడ్జెట్లో సవరించిన లెక్కల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఏప్రిల్-జనవరిలో ద్రవ్యలోటు 58.9 శాతంగా ఉండగా, అప్పటితో పోల్చితే ఇప్పుడు దాదాపు 9 శాతం ఎగబాకడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీలో ద్రవ్యలోటును రూ.17.55 లక్షల కోట్లకు లేదా 6.4 శాతానికి పరిమితం చేస్తామని కేంద్రంలోని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.
అయితే 10 నెలలు గడిచినప్పటికీ ఈ రెండు నెలల్లో ప్రభుత్వ ఖర్చులు అధికంగానే ఉంటాయన్న అంచనాల మధ్య ద్రవ్యలోటు లక్ష్య సాధనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ ఏప్రిల్-జనవరి మధ్య నికర పన్ను వసూళ్లు రూ.16,88,710 కోట్లుగా ఉన్నాయి. 2022-23కుగాను సవరించిన అంచనాలో 80.9 శాతానికి సమానం. అలాగే ఈ 10 నెలల్లో కేంద్ర ప్రభుత్వ మొత్తం వ్యయం రూ.31.67 లక్షల కోట్లుగా ఉన్నది. సవరించిన అంచనాలో 75.7 శాతం. కాగా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను దేశ జీడీపీలో ద్రవ్యలోటును 5.9 శాతానికే కట్టడి చేస్తామని ఫిబ్రవరి 1న లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి విదితమే. 2025-26కల్లా దేశ జీడీపీలో ద్రవ్యలోటును 4.5 శాతం దిగువకు తేవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 7 శాతం వృద్ధి అంచనా
వాస్తవికమైనది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.5 శాతం వృద్ధిరేటు ఉండొచ్చు. అయితే ఎల్ నినో కారణంగా వర్షాలకు సంబంధించి కొంత అనిశ్చితి ఉన్నది. కాబట్టి వచ్చే ఆర్థిక సంవత్సరానికిగానూ ద్రవ్యవిధాన పరమైన చర్యలతోపాటు, సరఫరాకు సంబంధించి అవరోధాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది.
– అనంత్ నాగేశ్వరన్, ప్రధాన ఆర్థిక సలహాదారు