Forex Reserves | భారత్ ఫారెక్స్ రిజర్వు నిధులు భారీగా పెరిగాయని ఆర్బీఐ శుక్రవారం తెలిపింది. ఈ నెల ఎనిమిదో తేదీతో ముగిసిన వారానికి భారత్ ఫారెక్స్ నిల్వలు 2.816 బిలియన్ డాలర్లు పెరిగి 604.042 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 2021 అక్టోబర్ నెలలో దేశీయ ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ డాలర్ల ఆల్ టైం గరిష్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే.
అయితే, గతేడాది కాలంగా అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత కరెన్సీ ‘రూపాయి’పై ఒత్తిళ్లు పెరిగిపోవడంతో ఫారెక్స్ నిల్వలు పడిపోయాయి. కానీ ఈ నెల ఎనిమిదో తేదీతో ముగిసిన వారానికి విదేశీ కరెన్సీ ఆస్తులు 3.089 బిలియన్ డాలర్లు పెరిగి 536.699 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ విడుదల చేసిన డేటా పేర్కొంది. అమెరికా డాలర్ మినహా యూరో, పౌండ్, యెన్ తదితరాల డాలర్ ఇండెక్స్‌లో ఒడిదొడుకుల ప్రభావంతో విదేశీ కరెన్సీ ఆస్తులపై ప్రభావం పడుతుంది.
ఇదిలా ఉంటే బంగారం నిల్వలు మాత్రం 199 మిలియన్ డాలర్లు తగ్గి 47.13 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ సైతం 63 మిలియన్ డాలర్లు తగ్గిపోయి 18.188 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో భారత రిజర్వు నిల్వలు 11 మిలియన్ డాలర్లు తగ్గి 4.842 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.