Forex Reserves | భారత్ విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు పెరిగాయి. ఈ నెల 15వ తేదీతో ముగిసిన వారానికి 9.11 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 615.97 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ నిల్వలు పెరిగాయని ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది. ఈ నెల 8వ తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.82 బిలియన్ డాలర్లు పుంజుకుని 606.86 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
విదేశీ కరెన్సీ నిల్వలు 8.35 బిలియన్ డాలర్లు పెరిగి 545.05 బిలియన్ డాలర్ల వద్దకు చేరాయి. బంగారం నిల్వలు 446 మిలియన్ డాలర్ల పెరుగుదలతో 47.58 బిలియన్ డాలర్లు, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 135 మిలియన్ డాలర్ల నుంచి 18.32 బిలియన్ డాలర్లకు పుంజుకున్నాయి. ఐఎంఎఫ్‌లో ఫారెక్స్ నిల్వలు 181 మిలియన్ డాలర్లు పెరిగి 5.02 బిలియన్ డాలర్లకు చేరాయి.2021 అక్టోబర్‌లో భారత్ ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ల డాలర్ల ఆల్ టైం రికార్డు నెలకొల్పాయి. అంతర్జాతీయ పరిణామాలకు తోడు డాలర్ పై రూపాయి మారకం విలువ ఒడిదొడుకులకు గురవుతున్నప్పుడల్లా ఆర్బీఐ.. బహిరంగ మార్కెట్ లో డాలర్లు విడుదల చేస్తున్నది.