Forex Reserves | మళ్లీ ఫారెక్స్ నిల్వలు పుంజుకుంటున్నాయి. గత నెల 29తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 2.759 బిలియన్ డాలర్లు పెరిగి 623.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ తెలిపింది. డిసెంబర్ 22వ తేదీతో ముగిసిన వారం ఓవరాల్ ఫారెక్స్ నిల్వలు 4.471 బిలియన్ డాలర్లు పెరిగి 620.441 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఇంతకుముందు గతేడాది జూలై 14తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు దాదాపు 15 నెలల గరిష్టం 609.02 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.
ఇంతకుముందు 2021 అక్టోబర్‌లో ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ డాలర్ల ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరాయి. అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ, అంతర్జాతీయంగా భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో గత ఏడాది కాలంగా ఫారెక్స్ నిల్వలు తగ్గుముఖం పడుతూ వచ్చాయి.
గత నెల 29 నాటికి ఫారెక్స్ నిల్వల్లో ఫారిన్ కరెన్సీ అసెట్స్ 1.869 బిలియన్ డాలర్లు పెరిగి 551.615 బిలియన్ డాలర్లకు చేరాయి. గోల్డ్ రిజర్వు నిల్వలు 853 మిలియన్ డాలర్లు పెరిగి 48.328 బిలియన్ డాలర్లకు పెరిగాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్స్) 38 మిలియన్ డాలర్లు పుంజుకుని 18.365 మిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ తెలిపింది. కానీ, ఐఎంఎఫ్‌లో భారత్ రిజర్వు నిల్వలు 2 మిలియన్ డాలర్లు తగ్గి 4.892 బిలియన్ డాలర్లకు పెరిగాయని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది.