Forex Reserves | విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు పుంజుకున్నాయి. గత 14వ తేదీతో ముగిసిన వారానికి నాలుగు నెలల్లో తొలిసారి ఫారెక్స్ నిల్వలు 12.74 బిలియన్ డాలర్లు పెరిగి 609.02 బిలియన్ డాలర్లకు పెరిగాయని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) శుక్రవారం తెలిపింది. ఇది 15 నెలల గరిష్ట స్థాయి అని వెల్లడించింది. ఈ నెల ఏడో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 1.23 బిలియన్ డాలర్లు పెరిగాయి.
ఫారిన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ) 11.19 బిలియన్ డాలర్లు పెరిగి 540.17 బిలియన్ డాలర్లకు చేరాయి. యూరో, పౌండ్, యెన్ వంటి విదేశీ కరెన్సీల పతనం వల్ల భారత్.. ఫారెక్స్ నిల్వలు పెరిగాయని ఆర్బీఐ పేర్కొంది.
మరోవైపు గోల్డ్ రిజర్వు నిల్వలు 1.14 బిలియన్ డాలర్లు పెరిగి 45.20 బిలియన్ డాలర్లకు చేరితే, ఎస్డీఆర్లు 250 మిలియన్ డాలర్ల పెరుగుదలతో 18.500 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లో భారత్ ఫారెక్స్ నిల్వలు 158 మిలియన్ డాలర్లు పెరిగి 5.18 బిలియన్ డాలర్లకు చేరాయి.
గత మే నెలలో స్పాట్ ఫారిన్ ఎక్చ్సేంజ్ మార్కెట్లో 7.37 బిలియన్ డాలర్లను కొనుగోలు చేసింది ఆర్బీఐ. ఏప్రిల్ నెలలో నికరంగా 7.70 బిలియన్ డాలర్లు కొన్నది. గత మే నెలలో అమెరికా డాలర్ మీద రూపాయి మారకం విలువ ఒక శాతానికి పైగా పతనమైంది.