India’s economy : 2026 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.4 శాతం ఉండొచ్చని భారత గణాంకాల సంస్థ (నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ)) అంచనా వేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ఈ ఏడాది మార్చి చివరినాటికి ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంచనాలకు మించి వృద్ధి ఉంటుందని ఎన్ఎస్ఓ తెలిపింది. గతంలో ఈ అంచనా 6.3-6.8 శాతంగా ఉండేది.
అయితే, అనేక పరిణామాల నేపథ్యంలో వృద్ధి రేటు పెరుగుతుందనే విశ్వాసాన్ని ఎన్ఎస్ఓ వ్యక్తం చేసింది. అయితే, భారత ప్రభుత్వ ప్రతిపాదిత వృద్ధి రేటు మాత్రం 8.0. అంటే ప్రతిఏటా 8.0 శాతం వృద్ధి సాధించాలని ప్రభుత్వ లక్ష్యం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదైంది. ఆర్థిక వృద్ధిలో సేవా రంగానిది ప్రధాన పాత్ర. ఈ రంగంలో ఈ ఏడాది సగటున 7.3 శాతం వృద్ధి అంచనా ఉంది. అలాగే ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్, ఇతర సేవారంగాల్లో 9.9 శాతం వృద్ధి ఉండే అవకాశం ఉంది.
ఇక తయారీ, నిర్మాణ రంగాల్లోనూ నిలకడైన పెరుగుదల కనిపిస్తోంది. దాదాపు 7.0 శాతం వృద్ధి నమోదవ్వొచ్చు. మరోవైపు వ్యవసాయంలో మాత్రం వృద్ధి స్వల్పంగా అంటే.. 3.1 శాతంగా ఉండొచ్చు. ఆదాయపు పన్ను మినహాయింపు, జీఎస్టీ శ్లాబులలో మార్పులు, ఆర్బీఐ మద్దతు వంటి ప్రభుత్వ చర్యలు ఆర్థిక వృద్ధికి దోహదపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.