హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : భారత రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతకు మరింత ఊతమిచ్చే ముందడుగు పడింది. రక్షణ రంగ ప్రభుత్వ సంస్థ మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్)తో హైదరాబాద్కు చెందిన డ్రోగో ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దీంతో దేశీయంగా తయారుచేసే మానవరహిత వైమానిక వాహనాలు (యూఏవీలు), లోయిటరింగ్ మ్యూనిషన్ వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి, సమీకరణపై ఇరు సంస్థలు ఇక నుంచి కలిసి పనిచేయనున్నాయి.
ఈ ఒప్పందంపై శుక్రవారం పుణెలోడ్రోగో ఏరోస్పేస్ వ్యవస్థాపక సీఈవో యశ్వంత్ బొంతు, ఎంఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమార్ వైభవ్ గౌర్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా యశ్వంత్ బొంతు మాట్లాడుతూ.. భారత రక్షణ అవసరాలకు అధునాతన స్వదేశీ మానవరహిత వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో తమ డెల్టా వింగ్ కామికేజ్ కీలక ముందడుగు అని పేర్కొన్నారు.