న్యూఢిల్లీ, మార్చి 14: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సంస్థ శాటిలైట్ వ్యవస్థ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు భారత్‌లో రంగం సిద్ధమైంది. ఇప్పటికే మన దేశానికి చెందిన జియో, ఎయిర్‌టెల్‌తో స్టార్‌లింక్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే స్టార్‌లింక్ భారత్‌లో సేవలు ప్రారంభించడానికి కేంద్రం కొన్ని కఠిన షరతులు విధించినట్టు తెలిసింది. సున్నితమైన, సమస్యాత్మకమైన ప్రాంతాలలో శాంతి భద్రతల సమస్యను అదుపు చేసేందుకు కమ్యూనికేషన్ సేవలను నిలిపివేయడానికి, రద్దు చేయడానికి స్టార్‌లింక్ నియంత్రణ కేంద్రాన్ని భారత్‌లోనే ఏర్పాటు చేయాలని భారత్ డిమాండ్ చేసింది. విపత్తు నిర్వహణ, ప్రజా భద్రత కోసం అవసరమైనప్పుడు అధికార మార్గాలు, చట్ట అమలు సంస్థల ద్వారా కాల్ సర్వీసులను యాక్సెస్ చేసి తమ అదుపులోనికి తీసుకునే అధికారం ఉండాలని నిర్దేశించింది. కాగా, అత్యవసర సమయాలలో ముఖ్యంగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ఆయా నెట్వర్క్ కంపెనీల కంట్రోల్ సెంటర్లకు ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చి వాటిని నిలిపివేయమని ఆదేశిస్తుందని, అయితే కంట్రోల్ సెంటర్లు అమెరికా లాంటి దేశాల్లో ఉంటే వాటిపై నియంత్రణ భారత ప్రభుత్వం చేతిలో ఉండదని ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి తెలిపారు.