న్యూఢిల్లీ, నవంబర్ 12 : దేశవ్యాప్తంగా సిమెంట్‌కు ఎనలేని డిమాండ్ నెలకొంటున్నది. దీంతో సిమెంట్ తయారీ సంస్థలు తమ ప్లాంట్ల సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటున్నాయి. వచ్చే మూడేండ్లకాలంలో భారత్‌లో మరో 160-170 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తికానున్నదని దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఇదే సమయంలో వ్యాపార విస్తరణ కోసం ఆయా సంస్థలు రూ.1.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయని పేర్కొంది. గడిచిన మూడేండ్లలో 95 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి జతైంది. భవిష్యత్తులో సిమెంట్‌కు డిమాండ్ అధికంగా ఉండనున్నట్టు అంచనాలు వెల్లడికావడంతో తయారీ సంస్థలు తమ సామర్థ్యాన్ని భారీగా పెంచుకోవడానికి సిద్ధమయ్యాయి.
ప్రస్తుతం సిమెంట్ తయారీ సంస్థల రుణాలు తగ్గుముఖం పట్టాయని, అలాగే ఎబిటా కూడా స్థిరంగా ఉన్నదని నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న సిమెంట్‌లో 17 కంపెనీల వాటా 85 శాతంగా ఉన్నదని, ఆయా సంస్థలు మార్చి 31, 2025 నాటికి 668 మిలియన్ టన్నులు సామర్థ్యం కలిగివున్నాయి. దేశీయ సిమెంట్ సంస్థలు ఏకీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయని, దీంట్లోభాగంగా అతిపెద్ద ఐదు సిమెంట్ తయారీ సంస్థలు..చిన్న కంపెనీలను కొనుగోలు చేస్తున్నాయని పేర్కొంది. గతమూడేండ్లుగా సిమెంట్‌కు అధికంగా డిమాండ్ నెలకొన్నదని, ప్రైవేట్-ప్రభుత్వ రంగాలు మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయడంతో సరాసరి 9.5 శాతం వృద్ధిని సాధించిందని తెలిపింది.