న్యూఢిల్లీ : మాస్ లేఆఫ్స్‌తో వణుకుతున్న టెకీల్లో తాజా నివేదికతో సరికొత్త ఆశలు చిగురించాయి. ఈ ఏడాది భారత్‌లో సగటున 10 శాతం వేతన వృద్ధి ఉంటుందని కాన్ ఫెర్రీ తాజా వేతన సర్వే వెల్లడించడం ఊరట కలిగిస్తోంది. గత ఏడాది కంటే 0.4 శాతం అధికంగా భారత్‌లో సగటు వేతన పెంపు ఉంటుందని ఈ సర్వే స్పష్టం చేసింది. టెక్ దిగ్గజాలు ఎడాపెడా కొలువుల కోతకు దిగుతుండటం, పింక్ స్లిప్పుల కలకలంతో అనిశ్చితి నడుమ పది శాతం వేతన పెంపు సాధారణ విషయం కాదని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఆర్ధిక మాంద్యం భయాలు, ఆర్ధిక మందగమనం వెంటాడుతున్నా ఆరు శాతం పైగా జీడీపీ వృద్ధి అంచనాలు భారత ఆర్ధిక వ్యవస్ధపై ఆశావహ దృక్పధం కలిగిస్తున్నాయని కాన్ ఫెర్రీ చైర్మన్, రీజినల్ మేనేజింగ్ డైరెక్టర్ నవ్‌నీత్ సింగ్ పేర్కొన్నారు. 818 కంపెనీలు, 8,00,000కుపైగా ఉద్యోగులను పలకరించిన మీదట సర్వే ఈ వివరాలు వెల్లడించింది. ఆయా కంపెనీల్లో అత్యుత్తమ నైపుణ్యాలు కనబరిచే ఉద్యోగులు పది శాతం కంటే అధికంగా వేతన పెంపు పొందుతారని సర్వే పేర్కొంది.
ఈ ఏడాది అధిక వేతన పెంపు పొందే రంగాల్లో ఆర్ధిక సేవలు, బ్యాంకింగ్, టెక్నాలజీ, మీడియా, గేమింగ్ రంగాలు ముందువరసలో ఉంటాయని సర్వే వెల్లడించింది. టెక్నాలజీ రంగంలోని ఉద్యోగులు సగటున 10.4 శాతం, మీడియా 10.2 శాతం, గేమింగ్‌లో 10 శాతం చొప్పున వేతన పెంపు ఉంటుందని పేర్కొంది. ఇక సేవల రంగంలో ఉద్యోగులు 9.8 శాతం, ఆటోమోటివ్ 9 శాతం, కెమికల్ 9.6 శాతం, కన్జూమర్ గూడ్స్‌లో 9.8 శాతం, రిటైల్ రంగంలో 9 శాతం వేతన పెంపు ఉంటుందని సర్వే తెలిపింది. అత్యుత్తమ నైపుణ్యాలను కనబరిచే ఉద్యోగులకు ఆయా కంపెనీలు ఏకంగా 15 శాతం నుంచి 30 శాతం వరకూ వేతన పెంపు వర్తింపచేయవచ్చని నవ్‌నీత్ సింగ్ పేర్కొన్నారు.