E-Passport | కుంభకోణాల్లో చిక్కుకున్న వారు.. అవినీతికి పాల్పడిన వారు నకిలీ పాస్‌పోర్టులతో దేశం నుంచి పారిపోతున్నారు. ఇక నుంచి అలాంటి వ్యక్తులకు చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం భారతీయులందరికీ త్వరలో ఈ-పాస్‌పోర్టులు జారీ చేయనున్నది. భవిష్యత్ తర పౌరులందరికీ ఈ-పాస్‌పోర్ట్ విధానాన్ని త్వరలో భారత్ ప్రారంభిస్తుంది అని విదేశాంగశాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య ట్వీట్ చేశారు.
ఈ- పాస్‌పోర్టుల్లో నమోదు చేసిన పౌరుల బయోమెట్రిక్ డేటా సురక్షితంగా ఉండటంతోపాటు అంతర్జాతీయంగా ఇమ్మిగ్రేషన్ పోస్టుల వద్ద హాయిగా ముందుకెళ్లిపోవచ్చునని తెలిపారు. మైక్రోచిప్‌తో తయారు చేసిన పాస్‌పోర్ట్‌లో సదరు వ్యక్తికి సంబంధించిన బయోమెట్రిక్ డేటా మొత్తం ఉంటుందన్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) ద్వారా ఎంబీడెడ్ మైక్రోచిప్‌తో ఈ-పాస్‌పోర్ట్ తయారు చేస్తారు. దీంట్లో నుంచి ఆ వ్యక్తుల డేటా బదిలీ చేయడానికి వీలు కాకుండా సెక్యూరిటీ ఫీచర్లు రక్షణ కవచంగా ఉంటాయి.
మోసగాళ్లు డేటా దొంగిలించకుండా, సంతకాలు పొర్జరీ చేయకుండా అప్‌గ్రేడెడ్ డాక్యుమెంట్లతో ఈ-పాస్‌పోర్టులు ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్‌కు కనెక్టివిటీ విస్తృతం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఎంబీడెడ్ మైక్రోచిప్‌లతో రూపొందించిన ఈ-పాస్‌పోర్టులు 20 వేల మంది అధికారులకు పంపిణీ చేసింది. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో పౌరులందరికీ ఈ-పాస్‌పోర్టులు జారీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రింటెడ్ బుక్‌లెట్స్‌తో పర్సనలైజ్డ్ పాస్‌పోర్టులు జారీ అయ్యేవి.
అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏవో) ప్రమాణాలకు అనుగుణంగా ఈ-పాస్‌పోర్టులు జారీ చేస్తామని కేంద్రం 2021లో ప్రకటించింది. దీన్ని ధ్వంసం చేయడం చాలా కష్ట సాధ్యం. పాస్‌పోర్టులో ముందు చిప్‌తోపాటు ఈ-పాస్‌పోర్టుకు గుర్తింపుగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన లోగో ఉంటుంది. దేశంలోని 36 పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో ఈ-పాస్‌పోర్టులు జారీ చేస్తారు.