ముంబై, ఏప్రిల్ 27 : బంగారం అనగానే చాలామందికి టక్కున నగలే ఊహకందుతాయి. అయితే ఇది ఒకప్పటి మాట. గత కొన్నేండ్లుగా కొనుగోలుదారుల మైండ్‌సెట్ మారిపోతున్నది. పుత్తడి అంటే ఇప్పుడు పెట్టుబడులు, అంతకుమించి అన్న సమాధానాలే వారి నుంచి వినిపిస్తున్నాయి మరి. అందుకు తగ్గట్టే గత ఏడాది నమోదైన మొత్తం పసిడి కొనుగోలులో ఆభరణాల వినియోగం వాటా 60 శాతం దిగువకు పడిపోయింది. ఈ మేరకు సోమవారం దేశీయ రేటింగ్ ఏజెన్సీ కేర్ఎడ్జ్ ఓ రిపోర్టులో పేర్కొన్నది. ప్రస్తుతం భారతీయులు గోల్డ్‌ను జ్యుయెల్లరీగా కంటే ఇన్వెస్ట్‌మెంట్‌గానే ఎక్కువగా చూస్తున్నారని చెప్తున్నది.
ఈ క్రమంలోనే ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) గోల్డ్ బయ్యర్లలో ఈ తరహా వినియోగదారుల వాటా 40 శాతం వరకు ఉండొచ్చని అంటున్నది. పెట్టుబడి కోణంలోనే పసిడిని కొంటారని స్పష్టం చేస్తున్నది. ‘దేశీయ బంగారం కొనుగోలుదారుల దృక్పథం మారుతున్నది. అది నిర్మాణాత్మక మార్పును సూచిస్తున్నది. భౌగోళిక-రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, పసిడి ధరల కదలికలు, మదుపర్ల వైవిధ్య పోర్ట్‌ఫోలియోలు.. పెట్టుబడికి బంగారాన్ని అనువుగా మార్చేస్తున్నాయి. పుత్తడి కొనుగోలులో ఈ ఆర్థిక సంవత్సరం 35-40 శాతం మదుపు కోసమే కొనేవారు ఉండవచ్చు’ అని కేర్ఎడ్జ్ డైరెక్టర్ అఖిల్ గోయల్ అన్నారు. దేశంలో పసిడిని నగలుగా వినియోగించేందుకు కొనేవారు 60 శాతంగా ఉంటే.. ప్రపంచ సగటు 50 శాతంగా ఉన్నట్టు తెలిపారు.
నిజానికి సంప్రదాయ పసిడి కొనుగోలుదారులు ఎక్కువగా ఉన్న భారత్‌లో.. బంగారాన్ని ఆధ్యాత్మిక కోణంలో చూడటం అధికం. పుత్తడిని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే నగల రూపంలో ఉన్న బంగారం.. భారత్‌లో ఇప్పటికీ అలాగే ఉంటూ వస్తున్నది. సదరు ఆభరణాలను అమ్మడానికో, కరిగించడానికో కూడా అంగీకరించని కుటుంబాలున్నాయంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. వారంతా వాటిని తరతరాల వారసత్వ ఆస్తిగానే చూస్తారు. ధరలు పెరుగుతున్నా.. నిరుడు భారతీయ ఆభరణాల డిమాండ్ స్థిరంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. గతంతో పోల్చితే 10 శాతం ఎగసి రూ.4.8 లక్షల కోట్లకు చేరింది. అయినప్పటికీ గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు)తోపాటు బంగారం కడ్డీలు, నాణేలకు సైతం డిమాండ్ పెరుగుతున్నదని మార్కెట్ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
గత ఏడాది భారతీయ పసిడి పెట్టుబడుల డిమాండ్ దశాబ్దకాలం గరిష్ఠాన్ని తాకిందని కేర్ఎడ్జ్ తెలియజేసింది. 2025లో గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు 37.5 టన్నుల మేర పెరిగాయన్నది. గడిచిన పదేండ్లలో వచ్చిన మొత్తం పెట్టుబడులను ఇది మించిపోయినట్టు కేర్ఎడ్జ్ తెలిపింది. ఇదిలావుంటే గత ఆర్థిక సంవత్సరం (2025-26) స్టాక్ మార్కెట్లలో నమోదైన భారీ జ్యుయెల్లర్స్ రెవెన్యూ దాదాపు 35 శాతం పెరిగి ఉండవచ్చని కేర్ఎడ్జ్ అంచనా వేస్తున్నది.
ఢిల్లీ రిటైల్ మార్కెట్లో కిలో వెండి ధర సోమవారం రూ.3,500 పెరిగింది. రూ.2,50,500కు చేరినట్టు అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలియజేసింది. మరోవైపు 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాములు పుత్తడి రేటు రూ.200 పెరిగి రూ.1,56,100గా నమోదైంది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం విలువ రూ.300 దిగి రూ.1,40,900గా ఉన్నది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 4,704 డాలర్లు, సిల్వర్ 75.60 డాలర్లు పలికాయి.