ముంబై, నవంబర్ 5: తమ రుణ పరపతిని భారతీయ యువత బాధ్యతాయుతంగా వాడుకుంటున్నట్టు ఓ తాజా సర్వేలో తేలింది. నైపుణ్యాభివృద్ధి, కెరియర్ ఉన్నతి, ఆంత్రప్రెన్యూర్ లక్ష్యాల సాధన వంటి వాటికి నేటి తరం.. రుణాలను పెట్టుబడిగా వినియోగించుకుంటున్నట్టు డిజిటల్ లెండింగ్ వేదిక ‘ఎంపాకెట్’ తెలియజేసింది. సర్వేలో పాల్గొన్నవారిలో 63 శాతం మంది తమ ఆర్థిక శ్రేయస్సుకు రుణాలు కలిసొచ్చాయని చెప్పారు.
దాదాపు 40 శాతం మంది ప్రొఫెషనల్‌గా ఎదిగేందుకు, జీవనశైలి మెరుగుపడేందుకు, ఉన్నత విద్యను అభ్యసించడానికి రుణాలు దోహదం చేశాయన్నారు. ఇక ఆరోగ్య సంరక్షణకు, అత్యవసరాలకూ రుణాలపై ఆధారపడాల్సి వస్తున్నదని మరికొందరు పేర్కొన్నారు. మొత్తంగా స్వయం సమృద్ధికి, దీర్ఘకాలిక వృద్ధికి రుణ పరపతిని వాడారని సర్వే తేల్చింది. ఈ సర్వేలో 3 వేలమందికిపైగా యువత పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఎదుగుదలకు రుణాలను సాధనంగా మార్చుకుంటున్న యువత అభినందనీయులని ఎంపాకెట్ వ్యవస్థాపక సీఈవో గౌరవ్ జలాన్ ప్రశంసించారు.